Begin typing your search above and press return to search.

విద్యార్థులకు విదేశాంగ శాఖ వార్నింగ్

By:  Tupaki Desk   |   23 Dec 2015 12:01 PM GMT
విద్యార్థులకు విదేశాంగ శాఖ వార్నింగ్
X
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులకు విదేశాంగ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ.. నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ రెండు యూనివర్సిటీలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించింది. ఈ రెండు యూనివర్సిటీల్లో చదువుకోవాలని భావించే విద్యార్థులు అమెరికాకు వెళ్లొద్దని హెచ్చరించింది.

ఈ రెండు యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థుల్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకునే అవకాశం ఉందని.. అందుకే.. ఈ రెండు యూనివర్సిటీలలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలని భావిస్తున్న వారు.. అక్కడకు వెళ్లటం ఏ మాత్రం మంచిది కాదని విదేశాంగ తేల్చింది. తాజాగా భారత్ నుంచి 14 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో సీటు పొంది కాలిఫోర్నియాకు వెళ్లటం.. అక్కడి విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు భారత విద్యార్థుల్ని అడ్డుకొని.. వారిని వెనక్కి పంపిన వైనం తెలిసిందే.

ఈ సందర్భంగా భారత విద్యార్థుల పట్ల అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. మాదక ద్రవ్యాల కేసులో నిందితుల తో కలిసి విద్యార్థుల్ని జైళ్లల్లో ఉంచారు. వారు తినేందుకు శాఖాహారం ఇవ్వకుండా ఎద్దుమాంసం.. పందిమాంసం మాత్రమే ఇవ్వటం.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత్ ఇప్పటికే అమెరికాకు తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే.. ఈ రెండు యూనివర్సిటీల్లో చదువుల కోసం వెళ్లే వారిని వెళ్లొద్దంటూ తాజాగా విదేశాంగ శాఖ పేర్కొనటం గమనార్హం.