Begin typing your search above and press return to search.

స‌ర్కారు ఆర్డ‌ర్‌..అక్ర‌మ‌ సంబంధంకు శిక్ష ఖాయ‌మే

By:  Tupaki Desk   |   11 July 2018 4:42 PM GMT
స‌ర్కారు ఆర్డ‌ర్‌..అక్ర‌మ‌ సంబంధంకు శిక్ష ఖాయ‌మే
X
జీవిత భాగస్వామి తమకు తగిన వ్యక్తి కాదనో.. కొత్తదనం కోసమో.. ఆర్థికంగా ఎదగాలనో.. ఇలా రకరకాల కారణాలతో వివాహేతరబంధం పెట్టుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితం.. ఆనందంగా సాగాల్సిన సంసార నౌకలు తీరం చేరకుండానే నడిసంద్రంలో సుడిగుండాలపాలవుతున్నాయి. లక్షలు - కోట్లు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని.. రోజులు - నెలలు గడవక ముందే నవదంపతులు అసంతృప్తి - అపోహలతో పోలీసుల్ని - న్యాయవాదుల్ని ఆశ్రయించి మూడుముళ్ల బంధానికి భరతవాక్యం పలుకుతున్నారు. లేదా హత్యలు - ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధాలు తప్పా ఒప్పా.. 18 ఏళ్లు నిండినవారు తమకిష్టమైన వ్యక్తితో శృంగారంలో పాల్గొనే హక్కు ఉందా లేదా.. అన్నది వేరే చర్చ. కానీ, అలాంటి సంబంధాల వల్ల జరిగే నేరాల సంఖ్య మాత్రం గణనీయంగా పెరగడమే ఆందోళన కలిగిస్తున్న అంశం.

ఇలా ఆందోళ‌న‌లు అక్రమ సంబంధాల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. శిక్షార్హమైన నేరమే అని కేంద్రం స్పష్టం చేసింది. వివాహ వ్యవస్థ పవిత్రను కాపాడేందుకు ఆ శిక్ష అవసరమే అని సుప్రీంకోర్టుకు తెలిపింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తినే కాకుండా మహిళకు కూడా శిక్షను విధించాలంటూ దాఖలైన పిటీషన్‌ పై సుప్రీంకోర్టు తన వాదనలను వినిపించనుంది. అయితే ఈ అంశంపై కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 497 - 198(2) చట్టాలను రద్దు చేస్తే భారతీయ మూలాలకు పెను విఘాతం ఏర్పడే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీని వల్ల భారతీయ వివాహ వ్యవస్థ ప్రాముఖ్యత కూడా తగ్గే ప్రమాదం ఉందని కేంద్రం పేర్కొంది. బ్రిటీష్ కాలం నాటి చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుంటే అతనికి అయిదేళ్ల జైలు శిక్ష వేస్తారు. దానితో పాటు జరిమానా కూడా విధిస్తారు. అడల్ట్రీ పిటీషన్‌ పై అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ బాధితురాలు కాదు అని, ఆమె కూడా నేరస్తురాలే అని పిటీషన్‌ లో పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న 400కు పైగా ఫ్యామిలీ కోర్టుల్లో పెండింగ్‌ లో వున్న లక్షలాది విడాకుల కేసుల్లో 20 శాతం కేసులకు వివాహేతర సంబంధాలే మూలం. మ‌రోవైపు వివాహేతర సంబంధాల కారణంగా అధికంగా హత్యలు జరుగుతున్న రాష్ట్రాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 2వ స్థానంలో - తెలంగాణ 4వ స్థానంలో వున్నాయి. 2015 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ లో 1099 హత్యలు జరిగాయి. వాటిలో వివాహేతర సంబంధాల కారణంగా జరిగినవి198 హత్యలు. 214 హత్యలతో ఈ జాబితాలో మహారాష్ట్ర అగ్రభాగాన ఉంది. ఇలాంటి హత్యలు ఉత్తరప్రదేశ్‌ లో 190 - తెలంగాణలో 156 - బీహార్‌ లో 123 జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ లోని బేగంపేట్‌ మహిళా పోలీస్టేషన్‌ లో గత మూడేళ్ల వ్యవధిలో 1819 గృహహింస కేసులు నమోదు కాగా.. వాటిలో 25 శాతానికి పైగా కేసులు వివాహేతర సంబంధాల కారణంగా నమోదైనవే. విశాఖపట్నంలో 2015లో నమోదైన 480 గృహహింస కేసుల్లో 20 శాతానికి పైగా వివాహేతర సంబంధాల కారణంగా నమోదైనవేనని గణాంకాలు చెబుతున్నాయి.