Begin typing your search above and press return to search.

సెక్ష‌న్ 497 ర‌ద్దు...సుప్రీం తీర్పు!

By:  Tupaki Desk   |   27 Sep 2018 12:25 PM GMT
సెక్ష‌న్ 497 ర‌ద్దు...సుప్రీం తీర్పు!
X
గ‌త ఏడాది కాలంగా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ లోని సెక్షన్‌ 497 పై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. వివాహేతర సంబంధాలను (ఆడల్టరీ) క్రిమిన‌ల్ నేరంగా పరిగణించే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ లోని సెక్షన్‌ 497ను కొట్టివేయాలంటూ 2017లో జోసెఫ్‌ షైనీ అనే పిటిష‌నర్ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించడంతో ఈ వ్య‌వ‌హారం పై చ‌ర్చ మొద‌లైంది. ఆ సెక్ష‌న్ ప్ర‌కారం వివాహేత‌ర సంబంధంలో ప‌ర‌స్ప‌ర స‌మ్మ‌తితో స్త్రీపురుషులిద్ద‌రూ పాల్గొన్న‌ప్ప‌టికీ...కేవ‌లం పురుషుడిని నిందితుడిగా ప‌రిగ‌ణిస్తున్నార‌ని - స్త్రీని బాధితురాలిగానే ప‌రిగ‌ణిస్తున్నార‌ని పిటిష‌న‌ర్ ఆరోపించాడు. ఈ నేప‌థ్యంలో ఆ కేసు విచార‌ణ జ‌రిపిన ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాసనం నేడు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. 158 ఏళ్ల‌నుంచి వ‌స్తోన్న పురాత‌న‌ ఐపీసీ సెక్ష‌న్ 497ను ఏకగ్రీవంగా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. సెక్షన్‌ 497 కాలం చెల్లిన‌ద‌ని - మహిళలకు సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్‌ 497 తూట్లు పొడుస్తోంద‌ని అభిప్రాయపడింది. మహిళల సమానత్వానికి అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. వివాహమైతే పురుషులు భార్యలను తమ ఆస్తిగా భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ, వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చని - దాన్ని క్రిమిన‌ల్ నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టంచేసింది.

సెక్షన్ 497 ఒక పురాతన చట్టమని - అది ఏకపక్షంగా కేవ‌లం పురుషుల‌ను మాత్ర‌మే శిక్షించేలా ఉందని అభిప్రాయపడింది. ఆ సెక్ష‌న్ ప్రకారం వివాహేత‌ర సంబంధంలో పురుషుడిని మాత్ర‌మే నిందితుడిగా ప‌రిగ‌ణిస్తున్నార‌ని - స్త్రీని బాధితురాలిగా చూస్తున్నార‌ని సుప్రీం అభిప్రాయ‌ప‌డింది. సెక్షన్ 497తోపాటు వివాహేత‌ర సంబంధాల‌కు సంబంధించిన‌ సెక్షన్ 198 కూడా రాజ్యాంగ సమ్మతం కాదని సుప్రీం వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వపు హక్కును సెక్షన్ 497 ఉల్లంఘిస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని సుప్రీం అభిప్రాయ‌ప‌డింది. వివాహేతర సంబంధాల విషయంలో వివాహితలను మినహాయించి.. కేవ‌లం పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్‌ 497ను రద్దు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. అయితే, వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్‌ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. సెక్షన్‌ 497 ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక రెండూ విధించ‌వ‌చ్చు. కానీ, ఆ వివాహేత‌ర సంబంధంలో పాల్గొన్న స్త్రీకు శిక్ష వ‌ర్తించ‌దు. ఆమె కేవ‌లం బాధితురాలిగా మిగులుతుంది. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. కానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం మతానికి - జాతికి - కులానికి - ప్రాంతానికి అతీతంగా స్త్రీ - పురుషులంతా చట్టం ముందు సమానం. అటువంట‌పుడు సెక్షన్ 497 కూడా ఆ ఆర్టికల్‌ కు లోబడే ఉండాలని, కాబట్టి ఈ సెక్షన్‌ ను చెల్లబోదని పిటిషనర్ జోస‌ఫ్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.