Begin typing your search above and press return to search.

కళ్లు ఎర్రబడితే కేర్ ఫుల్.. పాజిటివ్ ఖాయమట

By:  Tupaki Desk   |   20 Jun 2020 4:15 AM GMT
కళ్లు ఎర్రబడితే కేర్ ఫుల్.. పాజిటివ్ ఖాయమట
X
మహమ్మారి మనకు సోకిందా? లేదా? అన్న విషయాన్ని తేల్చాలంటే ఇప్పటివరకూ గొంతు నొప్పి.. దగ్గు.. జ్వరం.. శ్వాస తీసుకోలేకపోవటం లాంటి సమస్యల్ని సంకేతాలుగా భావించటం తెలిసిందే. వీటితో పాటు.. వాసన చూసే శక్తి మందగించటం.. వినిపించే సమస్యలో తేడా రావటం కూడా పాజిటివ్ లక్షణాలేనని మొదట్లోనే గుర్తించినా.. ఆ విషయాన్ని చాలామంది సీరియస్ గా తీసుకోలేదు. ఇటీవల కాలంలో ఈ రెండింటిని కూడా మహమ్మారి సోకిన దానికి నిదర్శనంగా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా మరోకొత్త విషయాన్ని గుర్తించారు. కళ్లు ఎర్రబడటం కూడా మాయదారి రోగ లక్షణానికి సంకేతంగా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కెనడాకు చెందిన అల్బెర్టా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ చెబుతున్నారు. కంటి సమస్యతో ఒక మహిళ తన వద్దకు రాగా.. తొలుత అది కంటి సమస్యగా తాను భావించానని.. తర్వాత పరీక్షలు జరపగా.. అది మహమ్మారి కేసుగా గుర్తించినట్లు చెబుతున్నారు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కార్లెస్ సోలర్టె చెప్పారు.

ఈ కేసు తర్వాత.. తాను జరిపిన పరిశీలనలో.. పాజిటివ్ గా తేలిన కేసుల్లో పది నుంచి పదిహేను శాతం మందికి సెకండరీ లక్షణంగా కళ్ల కలక.. కళ్లు ఎర్రబడటంలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు తాము గుర్తించినట్లు వెల్లడించారు. ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్న వారిని సాధారణ కంటి సమస్యగా భావించే కన్నా.. నిర్దారణ పరీక్ష చేయాల్సిందేనని చెబుతున్నారు. ఒకవేళ పాజిటివ్ గా తేలితే.. మహమ్మారి చికిత్సతో పాటు.. కంటి వైద్యుల చేత కూడా వైద్యం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. సో.. బీకేర్ ఫుల్.