Begin typing your search above and press return to search.
మనతో పెట్టుకుంటే ఏం అవుతుందో ఫేస్ బుక్ కు తెలిసింది
By: Tupaki Desk | 25 March 2018 5:35 AM GMTఫేస్ బుక్ కు భారత్ దెబ్బ బలంగానే తాకినట్లే కనిపిస్తోంది. యూజర్ డాటా లీకుల అంశం.. ఫేస్ బుక్ ను తీవ్రంగానే ప్రభావితం చేస్తున్నది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి అనుబంధంగా పనిచేసినట్లు ఆరోపణలు - భారత రాజకీయవ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే విరుచుకుపడిన సంఘటనలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాకు 5 కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం చిక్కిందన్న దానిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్ తో పలు సంస్థలు తమ వ్యాపార సంబంధాలను తెంచుకుంటున్నాయి. మొజిల్లా - టెస్లా - స్పేస్ ఎక్స్ తదితర ప్రముఖ కంపెనీలు ఈ సోషల్ మీడియా దిగ్గజానికి దూరంగా జరుగుతున్నాయి. అయితే ఇది శాశ్వతం కాకపోవచ్చన్న సంకేతాలిస్తుండటం ఫేస్ బుక్ కు కాస్త ఊరటనిస్తుండగా, అయినప్పటికీ ఈ వివాదం కారణంగా ఫేస్ బుక్ కు మాత్రం భారీ నష్టమే వాటిల్లుతుంది.
ఫేస్ బుక్ తో అనుబంధానికి మేము కాస్త విరామం ఇచ్చాం అని మొజిల్లా తెలిపింది. అయితే ఫేస్ బుక్ లో వ్యాపారపరమైన ప్రకటనలకే దూరంగా ఉంటామని, ఫేస్ బుక్ పేజీపై పోస్టింగ్ ల విషయంలో కాదని చెప్పింది. యూజర్ల డాటాను రక్షించేలా సమర్థవంతమైన చర్యలను తీసుకుంటే, వ్యక్తిగత సమాచార భద్రతను మరింతగా కట్టుదిట్టం చేస్తే వ్యాపార ప్రకటనలను పునరుద్ధరించే యోచన చేస్తామంది. ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను సృష్టించినది మొజిల్లానేనన్న సంగతి విదితమే. జర్మనీకి చెందిన కామర్జ్ బ్యాంక్ కూడా ఫేస్ బుక్ అడ్వర్ టైజ్ మెంట్లను పక్కనబెట్టింది. స్పీకర్లు - ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ సోనోస్ సైతం ఫేస్ బుక్ - ఇన్ స్టాగ్రామ్ - గూగుల్ - ట్విట్టర్ తదితర సోషల్ మీడియా నుంచి వ్యాపార ప్రకటనల్ని విరమించుకుంటున్నట్లు పేర్కొంది. ఫేస్ బుక్ సైట్ల నుంచి తప్పుకుంటున్నట్లు, ఖాతాలను తొలగిస్తున్నట్లు టెస్లా - స్పేస్ ఎక్స్ సంస్థల సీఈవో ఎలన్ మస్క్ చెప్పారు.
మరోవైపు ఈ ఏడాది ప్రపంచ కుబేరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. దాదాపు గడిచిన ఈ రెండు నెలల్లోనే టాప్-500 సంపన్నులు రూ.28,34,000 కోట్ల (436 బిలియన్ డాలర్లు)ను కోల్పోయారు. వీరిలో ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంపద అత్యధికంగా రూ.67 వేల కోట్లు (10.3 బిలియన్ డాలర్లు) హరించుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం - ఇటీవలి డేటా లీకేజీ వ్యవహారం మధ్య జుకర్ బర్గ్.. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీలో మూడు స్థానాలు దిగజారారు. 4వ స్థానం నుంచి 7వ స్థానానికి పడిపోయారు. కేవలం డేటా లీక్ వార్తలతోనే స్టాక్ మార్కెట్ లో ఫేస్ బుక్ షేర్ విలువ 14 శాతం నష్టపోయింది. డేటా లీకేజీపై స్పందిస్తూ ఇప్పటికే జుకర్ బర్గ్ క్షమాపణలు చెప్పగా - విచారణలో భాగంగా ఆయనకు సమన్లు అందుతున్న విషయం తెలిసిందే. ఇక జనవరి 26 నుంచి ఇప్పటిదాకా ప్రపంచంలోని 500 మంది కుబేరుల సంపద 436 బిలియన్ డాలర్లు కరిగిపోతే.. ఈ ఒక్క వారమే 181 బిలియన్ డాలర్లు తరిగిపోవడం గమనార్హం. ఒరాకిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన లర్రీ ఎల్లిసన్ 7 బిలియన్ డాలర్లు చేజార్చుకోగా, బెర్క్ షైర్ హాథవే చైర్మన్ వారెన్ బఫెట్ - అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ - అల్ఫాబెట్ సీఈవో లర్రీ పేజ్ లు 17 బిలియన్ డాలర్లను వదులుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ 500 మంది సంపన్నుల మొత్తం సంపద 5.2 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని బ్లూంబర్గ్ అంచనా.