Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు ఫేస్ బుక్ బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   30 Nov 2015 9:51 AM GMT
ఉద్యోగులకు ఫేస్ బుక్ బంపర్ ఆఫర్
X
రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? తాజా వ్యవహారం వింటే ఈ మాట నిజం అనిపించక మానదు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ త్వరలో తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ పిల్లల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆయన.. ఇప్పుడు తండ్రి పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకాలం పనిలో గడిపేసిన ఆయనకు.. తండ్రిగా తాను ఎలాంటి బాధ్యతలు నెరవేర్చాలో విపరీతంగా ఆలోచిస్తున్నారట. అప్పుడే పుట్టిన బిడ్డతో గడపటానికి ఉద్యోగులు పడే ఇబ్బంది ఆయనకు అర్థమైందట. అంతే.. కంపెనీకి సంబంధించిన హెచ్ పాలసీని సమీక్షించటమే కాదు.. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త పాలసీని తాజాగా ప్రకటించారు.

తాజా నిర్ణయం ప్రకారం.. ఫేస్ బుక్ పెరోల్స్ లో పని చేసే ఉద్యోగుల్లో ఎవరైనా తండ్రి అవుతుంటే.. సదరు ఉద్యోగికి నాలుగు నెలల పాటు సెలవలు మంజూరు చేయటంతో పాటు.. ఆ నాలుగు నెలలకు జీతం ఇవ్వాలని నిర్ణయించారు. అప్పుడే పుట్టిన బిడ్డతో ఎక్కువసేపు గడపాలని ప్రతి తండ్రికి ఉంటుందని.. అయితే.. ఉద్యోగ ధర్మం దాన్ని అడ్డుకుంటుందన్న విషయాన్ని అర్థం చేసుకోవటంతో జుకర్ బర్గ్ సూచనతో తాజా మార్పు చేసినట్లుగా చెబుతున్నారు. తమ ఉద్యోగికి సంస్థ తరఫున ఈ మాత్రం చేయాలని భావిస్తున్నట్లుగా ఫేస్ బుక్ మానవవనరుల విభాగం చెబుతోంది.

రాజుకు అనిపించాలే కానీ.. ఎలాంటి నిర్ణయాలైనా మారిపోతాయి. ఒకవేళ జుకర్ బర్గ్ కానీ తండ్రి కాకుంటే ఇలాంటి ఆలోచనే వచ్చేది కాదు కదా. అయితే.. జుకర్ కు సంబంధించి ఒక్క విషయంలో సంతోషపడాల్సిందే. ప్రపంచంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు తండ్రులయ్యారు. కానీ.. వారెవరూ ఆలోచించనంత సున్నితంగా ఆలోచించటాన్ని చూస్తే.. జుకర్ ను అభినందించక తప్పదు.