Begin typing your search above and press return to search.

మీ స‌మాచారం అమ్మేస్తున్నాం...ఫేస్‌ బుక్!

By:  Tupaki Desk   |   2 July 2018 7:24 AM GMT
మీ స‌మాచారం అమ్మేస్తున్నాం...ఫేస్‌ బుక్!
X
సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌ బుక్ సంచ‌ల‌న నివేదిక ఇచ్చింది. మన నుంచి సేకరిస్తున్న వివరాలను ఫేస్‌ బుక్ సంస్థ అమ్ముకుంటోంది. ఈ విషయాన్ని ఫేస్‌ బుక్ సంస్థే స్వయంగా ప్రకటించింది. ఖాతా తెరిచినప్పుడు ఆ తర్వాత మనం ఇస్తున్న వివరాలను 52 కంపెనీలతో పంచుకుంటున్నట్టు ఎట్ట‌కేల‌కు ఒప్పుకుంది. చిత్రంగా ఇందులో చైనా కంపెనీలు కూడా ఉన్నాయని తెలిపింది. కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణం వెలుగుచూసిన తర్వాత అమెరికా ప్రభుత్వం ఫేస్‌ బుక్‌ పై విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం నియమించిన ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీకి ఫేస్‌బుక్ సంస్థ 700 పేజీల నివేదికను శుక్రవారం సమర్పించింది. ఈ వివరాలను కమిటీ శనివారం ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఇందులో సంచ‌ల‌న వివ‌రాలు ఉన్నాయి.

ఫేస్‌ బుక్ ఒప్పందం కుదుర్చుకున్న నాలుగు చైనా కంపెనీల నుంచి ముప్పు పొంచి ఉన్నదని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం గతంలోనే హెచ్చరించినా ఫేస్‌బుక్ పెడచెవిన పెట్టడం గమనార్హం. ఖాతాదారులు - వారి స్నేహితుల సమాచారం పంచుకునేందుకు సెల్‌ ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పుందం చేసుకున్నట్టు ఫేస్‌ బుక్ ఒప్పుకుంది.తమ ఖాతాతారుల సమాచారాన్ని ఆపిల్ - అమేజాన్ - బ్లాక్‌ బెర్రీ - సామ్‌ సంగ్ వంటి బడా సంస్థలతోపాటు అలీబాబా - క్వాల్‌ కమ్ - పాంటెక్ వంటి మధ్యశ్రేణి సంస్థలకు - హువాయి - లెనొవో - ఒప్పో - టీసీఎల్ వంటి చైనా కంపెనీలకు సమాచారం ఇస్తున్నట్టు ఫేస్‌ బుక్ వెల్లడించింది. అయితే ఈ విష‌యాన్ని ఫేస్‌ బుక్ క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేసింది. వినియోగదారులు విభిన్న ఫ్లాట్‌ ఫామ్‌ లు - పరికరాల్లో సరికొత్త సేవలు పొందేందుకే డేటా షేరింగ్ ఒప్పందాలు చేసుకున్నామని ఫేస్‌ బుక్ తెలిపింది. హై టెక్నాలజీ - స్మార్ట్‌ ఫోన్‌ లు విస్తృతం కాకముందే.. ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని పేర్కొంది. 52 కంపెనీల్లో 38 సంస్థలతో సంబంధాలు తెంచుకున్నామని, మిగతా వాటి ఒప్పంద గడువు ఈ నెలతో పూర్తవుతుందని, ఇకపై పొడగించబోమని వివాదాన్ని పెద్ద‌ది కాకుండా చూసుకుంది.