Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్.. పోస్ట్ తొలగింపు

By:  Tupaki Desk   |   20 Aug 2021 1:42 PM GMT
రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్.. పోస్ట్ తొలగింపు
X
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ భారీ షాక్ ఇచ్చాయి. ఇప్పటికే ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ రాహుల్ ఖాతానే బ్లాక్ చేసి షాకివ్వగా.. ఇప్పుడు మరో రెండు సోషల్ మీడియాలు కూడా అదే బాట పట్టాయి. రాహుల్ గాంధీ పెట్టిన పోస్ట్ ను తొలగించాయి.

ఢిల్లీలో అత్యాచారం చేసి దారుణ హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యుల వివరాలను ఫేస్ బుక్ వేదికగా రాహుల్ గాంధీ పంచుకున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రజల అభ్యంతరకర దృశ్యాలను పోస్ట్ చేసినందుకు తొలగించామని ఈ రెండు సోషల్ మీడియా దిగ్గజాలు తెలిపాయి.

'ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ రాహుల్ గాంధీ పోస్ట్ ను తొలగించాయి. అది మైనర్ బాలిక బాధితురాలి తల్లిదండ్రు గుర్తింపును వెల్లడించింది' అని అధికార వర్గాలు తెలిపాయి.

అంతకుముందు మంగళవారం ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోకు సంబంధించిన ఫిర్యాదులో రాహుల్ గాంధీకి ఫేస్ బుక్ నోటీసు జారీ చేసింది. బాధితుడి వివరాలు వెల్లడించినందుకు వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోస్ట్ ను తొలగిస్తున్నట్టు పేర్కొంది.

భారత చట్టాలను అనుసరించి ఇలా అత్యాచార బాధితుల ఫొటోలు ప్రదర్శించడం చట్టవిరుద్ధం అని.. అందుకే ఈ పోస్ట్ ను తొలగిస్తున్నట్టుగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తెలిపింది. కాగా బాలల హక్కులు ఉల్లంఘించినందుకు రాహుల్ పై తగిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంస్థ పలువురు కోరారు.