Begin typing your search above and press return to search.

ఫేస్‌ బుక్ కార‌ణంగా టీనేజ్ అమ్మాయి పెళ్లి ర‌ద్దు

By:  Tupaki Desk   |   14 Oct 2017 4:14 AM GMT
ఫేస్‌ బుక్ కార‌ణంగా టీనేజ్ అమ్మాయి పెళ్లి ర‌ద్దు
X
ఫేస్‌బుక్ వ‌ల్ల పెళ్లి ర‌ద్ద‌వ‌డం అంటే ఒక అర్థం ఉంది..ఆ అమ్మాయి ఏదో ఇబ్బందిక‌ర‌మైన ప‌నుల‌కు ఆధారంగా ఫేస్‌ బుక్ పోస్ట్‌ లు మారి ఉంటాయి అనుకోవ‌చ్చు కానీ.... పెళ్లి ర‌ద్దు అవ‌డం ఏంటి...ఫేస్‌ బుక్ కారణంగా ఆమె కాపాడబ‌డ‌టం ఏంటి... అని ఆలోచించి అస్స‌లు బుర్ర బ‌ద్ద‌లు చేసుకోకండి. సింపుల్‌గా ఈ సంఘ‌ట‌న చ‌దివితే ఫేస్‌ బుక్ కార‌ణంగా జీవితంలో బుక్ అయిపోకుండా ఉన్న ఆ అమ్మాయి ఉదంతం తెలుస్తుంది.

తల్లిదండ్రుల బలవంతంతో రాజస్థాన్‌ కు చెందిన సుశీల బిష్ణోయ్(19) కు 2010లో అంటే 12 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. అయితే.. పెళ్లి జరిగినా.. తనకు 18 ఏళ్ల‌ వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల వద్దే సుశీల ఉండిపోయింది. ఇక.. 18 ఏళ్ళు నిండిన తర్వాత భర్త వద్దకు వెళ్లాలని సుశీలను తన తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. దీంతో భర్త వద్దకు వెళ్లడం ఇష్టంలేని సుశీల ఇంట్లోనుంచి పారిపోయింది. చివరకు ఓ మహిళ వద్ద తలదాచుకున్న సుశీల.. అసలు విషయం ఆ మహిళకు వివరించడంతో లీగల్‌ గా వెళ్లడానికి సుశీలకు ఆ మహిళ సహకరించింది. దీంతో సుశీల కోర్టులో కేసు వేసింది. `మైనర్ వయసులో ఉండగా పెళ్లి అయినట్లు నిరూపించుకో` అని న్యాయ‌స్థానం ఆదేశించింది.

ఈ స‌మ‌యంలో సునీత‌కు ఓ మంచి ఐడియా త‌ట్టింది. అదే త‌న భ‌ర్త ఫేస్‌ బుక్ అకౌంట్‌. తన భర్త ఫేస్‌ బుక్ అకౌంట్‌ లో పెళ్లి రోజు పెట్టిన పోస్ట్‌ కు వచ్చిన కామెంట్లను సాక్ష్యాలుగా సమ‌ర్పించింది. కామెంట్లు వ‌చ్చిన తేదీని బ‌ట్టి సుశీల వయసును లెక్కించిన కోర్టు ఆ శుభాకాంక్షలనే సాక్ష్యాలుగా స్వీకరించి మైనర్‌ గా ఉన్నప్పుడు జరిగిన పెళ్లిని రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది. అలా ఫేస్‌ బుక్‌ లో పెట్టిన పోస్టు - కామెంట్లు పెళ్లి ర‌ద్దు అయ్యేలా ఉప‌యోగ‌ప‌డ్డాయి. మొత్తంగా...ఫేస్‌ బుక్‌ లో ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుందని.. అది కూడా ఓ సాక్ష్యంగా నిలవడమే కాక.. మూడు ముళ్ల బంధానికి సంబంధించిన సమస్యలో పరిష్కారాన్ని చూపెడుతుందని తెలియజేసింది ఈ ఘటన అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.