Begin typing your search above and press return to search.

యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన ఫేస్ బుక్

By:  Tupaki Desk   |   9 Sep 2020 12:10 PM GMT
యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన ఫేస్ బుక్
X
కరోనా-లాక్ డౌన్ తో ఉద్యోగం కోల్పోయి తీవ్ర మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోను చూసి సకాలంలో స్పందించిన ఫేస్ బుక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందివ్వడంతో యువకుడి ప్రాణాలు దక్కాయి. పోలీసులు వేగంగా స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడారు.

పశ్చిమ బెంగాల్ లోని నాడియా జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. భీంపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మధ్యాహ్నం 1.30 గంటలకు ఫేస్ బుక్ లో ఓ వీడియో స్టేటస్ లో పెట్టాడు. దీనిపై పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫేస్ బుక్ సిబ్బంది సమాచారం అందజేశారు.

వెంటనే ఫేస్ బుక్ ప్రొఫైల్ ద్వారా లోకేషన్ ను గుర్తించిన పోలీసులు యువకుడి తండ్రి మొబైల్ నంబర్ ను తెలుసుకొని ఆయనకు సమాచారం ఇచ్చారు. వెంటనే తండ్రి గదిలోకి వెళ్లి రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తే కోలుకున్నాడు.

కరోనాతో ఉద్యోగం కోల్పోవడంతోనే యువకుడు డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు. చేతి మణికట్టుపై కత్తితో కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా.. ఫేస్ బుక్ స్పందించి కాపాడినట్టైంది.