Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ కు చెమటలు పట్టించిన తాజా బగ్.. సెట్ చేయటానికి 7 గంటలు

By:  Tupaki Desk   |   5 Oct 2021 3:44 AM GMT
ఫేస్ బుక్ కు చెమటలు పట్టించిన తాజా బగ్.. సెట్ చేయటానికి 7 గంటలు
X
ఇటీవల కాలంలో ఎప్పుడూ ఎదురుకాని కొత్త అనుభవం ప్రపంచానికి తాజాగా ఎదురైంది. విషయం ఏదైనా కానీ బ్యాకప్ ప్లాన్ ఒకటి అవసరమన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. నిత్యం సోషల్ ప్రపంచంలో నిమగ్నమైన వందల కోట్ల మంది కొన్ని గంటల పాటు.. ఆ ప్రపంచం నుంచి దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ లో చోటుచేసుకున్నసాంకేతిక ఇబ్బంది దానికి సంబంధించినవాట్సాప్.. ఇన్ స్టా సేవలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి 9.12 గంటలకు మొదలైన ఈ సమస్యను పరిష్కరించేందుకు దాదాపు ఏడు గంటల టైం తీసుకుంది.

రాత్రి తొమ్మిదింటికి మొదలైన సమస్య.. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నయూజర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిత్యం.. వాట్సాప్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాలో మునిగితేలే నెటిజన్లు.. ఇన్నేసి గంటల పాటు ఈ మాధ్యమాలు మూగబోయినట్లుగా ఉండిపోవటంతో కాళ్లు.. చేతులు ఆడనట్లుగా మారింది. తాజా బగ్ కు సంబంధించిన కారణాల్ని ఫేస్ బుక్ వెల్లడించనప్పటికీ.. దాన్ని పరిష్కరించేందుకు మాత్రంఏడు గంటల సుదీర్ఘ సమయం తీసుకోవటం గమనార్హం.

తన సేవల అంతరాయంపై ఫేస్ బుక్ క్షమాపణలు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా తమపై ఆధారపడిన కోట్ల మంది ప్రజలకు.. వ్యాపార కార్యకలాపాలు నడుపుతున్న వారికి తాము సారీ చెబుతున్నట్లుగా పేర్కొంది. నిలిచిపోయిన తమ సేవల్ని పునరుద్ధరించటంతో తిరిగి ఆన్ లైన్ కు వస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లుగా తెలిపిన ఫేస్ బుక్.. తమకు సహకారాన్ని అందించినందుకు ధన్యవాదాలు అంటూ ఫేస్ బుక్ వెల్లడించింది. ఇంతకీ ఇన్ని గంటల పాటు ఫేస్ బుక్ కు చుక్కలు చూపించిన తాజా బగ్ ఏమిటి? అసలేం జరిగిందన్న విషయాల్నిమాత్రం ఫేస్ బుక్ వెల్లడించలేదు. రానున్న కొద్ది రోజుల్లో దీనిపై వివరణ వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.