Begin typing your search above and press return to search.

దేశంలోనే తొలిసారి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆ ఏర్పాటు!

By:  Tupaki Desk   |   2 July 2019 5:42 AM GMT
దేశంలోనే తొలిసారి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆ ఏర్పాటు!
X
మిగిలిన ప్ర‌యాణ మార్గాల్లో లేని వ‌స‌తి విమాన ప్ర‌యాణంలో ఉంటుంది. వంద‌లాది కిలోమీట‌ర్ల దూరాన్ని గంట‌ల్లో వెళ్లే అవ‌కాశాన్ని ఇస్తుంటుంది. ఖ‌ర్చు కాస్త ఎక్కువైన‌ప్ప‌టికీ స‌మ‌యాన్ని ఆదా చేసుకోవ‌టానికి ప్రాధాన్య‌త ఇచ్చే వారు విమాన ప్ర‌యాణాల‌కు ప్రాధాన్య‌త ఇస్తుంటారు. అయితే.. ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన ప్ర‌తిసారీ చెకింగ్ కోసం ఉండే క్యూల‌తో విసుగు వ‌చ్చే ప‌రిస్థితి.

ఇలాంటి వాటిని చెక్ పెట్టే క్ర‌మంలో దేశంలో మ‌రే ఎయిర్ పోర్ట్ లో లేని రీతిలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొత్త విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చారు. కేవ‌లం హ్యాండ్ బ్యాగ్ తో ప్ర‌యాణించే వారి కోసం ప్ర‌స్తుతం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఫేస్ రిక‌గ్నైష‌న్ ద్వారా ప్ర‌యాణికుల్ని లోప‌ల‌కు అనుమ‌తించ‌నున్నారు. ఈ మెషిన్ కు మ‌నం ఎలా తెలుస్తామంటే.. మొద‌టిసారి ఇందులో మ‌న డేటాను రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ త‌ర్వాత నుంచి మ‌న ముఖం చూసినంత‌నే డేటా బేస్ లో ఉన్న మ‌న స‌మాచారాన్ని చూసుకొని వెంట‌నే గుర్తు ప‌ట్టేసి లోప‌ల‌కు వెళ్లేందుకు అనుమ‌తిస్తుంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌యోగించిన అధికారులు తొలుత హ్యాండ్ బ్యాగ్ తో ప్ర‌యాణించే వారి కోసం ఈ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చారు. రానున్న రోజుల్లో బ్యాగేజీ ప్ర‌యాణికుల‌కు ఈ విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని మూడో ద్వారం వ‌ద్ద ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో మ‌న వివ‌రాల్ని మొద‌టి సారి న‌మోదు చేయాలి. ఆ త‌ర్వాత నుంచి మ‌న‌ల్ని చూసినంత‌నే లోప‌ల‌కు అనుమ‌తి ఇచ్చేస్తుంది. దీంతో చాంతాడంత క్యూలైన్ల‌తో పాటు.. ఎక్కువ‌సేపు స‌మ‌యాన్ని వృధా చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఈ ఫీచ‌ర్ దేశంలో మ‌రే విమానాశ్ర‌యంలోనూ లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం.