Begin typing your search above and press return to search.

జైల్లో లాలూకు ఆ సేవ‌ల్ని అందిస్తున్నార‌ట‌

By:  Tupaki Desk   |   24 Dec 2017 9:13 AM GMT
జైల్లో లాలూకు ఆ సేవ‌ల్ని అందిస్తున్నార‌ట‌
X
డామిట్ క‌థ అడ్డం తిరిగింద‌న్న‌ది ఇప్పుడు లాలూ అండ్ కో నోటి నుంచి వ‌చ్చే మాట‌. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా వ‌స్తున్న కేసుల‌న్నీ వీగిపోవ‌టం.. సాక్ష్యాలు స‌రిగా లేవ‌ని కొట్టేయ‌టం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వేళ‌.. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం నాటి దాణా కుంభ‌కోణం నిలుస్తుంద‌ని.. త‌న‌కు శిక్ష ప‌డుతుంద‌ని లాలూ అస్స‌లు ఊహించ‌లేదు.

అయితే.. బ్యాక్ గ్రౌండ్ లోజ‌ర‌గాల్సిన‌వి జ‌ర‌గ‌కుండా.. చేసిన త‌ప్పుల‌కు ఫ‌లితం అనుభ‌వించ‌కుండా ఉండ‌టం సాధ్యం కాద‌న్న విష‌యం లాలూ ఎపిసోడ్‌ లో మ‌రోసారి నిరూపితమైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దాణా కుంభ‌కోణం కేసు తీర్పు వెలువ‌డుతున్న సంద‌ర్భంగా కోర్టుకు వెళ్లే క్ర‌మంలో లాలూ య‌మా ధీమాను ప్ర‌ద‌ర్శించారు. ఇలా కోర్టుకు వెళ్లి.. ఇలా తిరిగి రావ‌ట‌మే అన్న‌ట్లుగా ఆయ‌న భావించారు.

కొడుకుతో కోర్టుకు వెళ్లే టైంలో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న మాట‌ల్లో ధీమా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది. అయితే.. అనుకున్న‌ది ఒక‌టి.. అయ్యింది ఒక‌టి అన్నట్లుగా దాణా కేసులో లాలూను దోషిగా తేల్చేసి.. శిక్ష ఎప్పుడ‌న్న‌ది త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని పేర్కొన్నారు. ఊహించ‌నిరీతిలో వ‌చ్చిన తీర్పుతో షాక్ తిన్నంత పనైంది లాలూకు.

కోర్టు నుంచి విజ‌య‌గ‌ర్వంతో ఇంటికి వెళ‌తాన‌ని భావించిన ఆయ‌న‌.. న్యాయ‌స్థానం నుంచి జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. మాజీ ముఖ్య‌మంత్రిగా.. మాజీ కేంద్ర‌మంత్రిగా.. పార్టీ అధినేత‌గా ఉన్న ఆయ‌న విష‌యంలో అధికారులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు.

లాలూతో పాటు 15 మందిని దోషులుగా సీబీఐ కోర్టు తేల్చింది. ఇదిలా ఉంటే.. గ‌తంలో హార్ట్ స‌ర్జ‌రీ జ‌రిగిన నేప‌థ్యంలో లాలూకు ప్ర‌త్యేక వ‌స‌తుల్ని జైల్లో ఏర్పాటు చేశారు. ఆయ‌న‌కు ఇచ్చే ఆహారంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. జైలు గ‌దిలో టీవీ.. దోమ‌తెర‌.. వార్త ప‌త్రిక‌.. ఇంటి భోజ‌నం లాంటి సౌక‌ర్యాల్ని క‌ల్పిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. దాణా కేసులో గ‌తంలో లాలూ అరెస్ట్ అయిన‌ప్పుడు కూడా రాంచీలోని బిర్సాముందా జైల్లో.. ఇప్పుడు ఉన్న గ‌దిలోనే ఉన్నార‌ట‌. గ‌తంలో 77 రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద త‌ర్వాత విడుద‌ల‌య్యారు. ఆ స‌మ‌యంలో జైల్లో ఉన్న‌ప్పుడు లాలూ రూల్స్ బ్రేక్ చేసిన‌ట్లు చెబుతారు. త‌న‌కు సుప‌రిచిత‌మైన జైలు గ‌దిలో ఈసారైనా ప‌ద్ధ‌తిగా ఉంటారో.. లేదో? చూడాలి.