Begin typing your search above and press return to search.

అవ‌న్నీ 'ద‌మ్ము' ముచ్చ‌ట్లే!

By:  Tupaki Desk   |   2 Oct 2017 12:43 PM GMT
అవ‌న్నీ ద‌మ్ము ముచ్చ‌ట్లే!
X
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు నిన్న త‌న పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌తో క‌లిసి ఏపీలోని అనంత‌పురం జిల్లాకు వెళ్లారు. టీడీపీ దివంగ‌త నేత‌ - మాజీ మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర‌ - ప్ర‌స్తుత ఏపీ కేబినెట్ మంత్రి ప‌రిటాల సునీతల పెద్ద కుమారుడు ప‌రిటాల శ్రీరామ్ పెళ్లి వేడుక‌కు హాజ‌ర‌య్యేందుకే ఆయ‌న అనంత వెళ్లారు. పెళ్లి వేడుక‌లో చాలా ఉత్సాహంగా పాలుపంచుకున్న కేసీఆర్‌... ప‌రిటాల దంప‌తుల‌ను ఆశీర్వ‌దించి అక్క‌డి నుంచి తిరుగు ప‌య‌న‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాదు వ‌చ్చేందుకు విమానం కోసం ఆయ‌న అనంత‌పురం నుంచి అదే జిల్లాలోని పుట్ట‌ప‌ర్తి ఎయిర్‌ పోర్టుకు వెళ్లారు. అక్క‌డ టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్‌ - టీడీపీ అనంత‌పురం జిల్లా అధ్య‌క్షుడు బీకే పార్థ‌సార‌ధి - ఆ జిల్లాకు చెందిన మ‌రో మంత్రి కాల‌వ శ్రీనివాసులుతో మాటా మంతి క‌లిపారు.

ఈ ఫొటోల‌ను క్లిక్ మ‌నిపించిన తెలుగు మీడియా... అస‌లు టీడీపీలోని ఏపీకి చెందిన కీల‌క నేత‌లతో కేసీఆర్ ఏం మాట్లాడార‌న్న విష‌యంపై త‌మ‌దైన శైలిలో ప్ర‌త్యేక క‌థ‌నాలు రాసేశాయి. ప‌య్యావుల‌తో చ‌ర్చ‌లంటే... టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ఉన్న రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడ‌న్న పేరుంది. అంతేకాకుండా.... రాజ‌కీయాల్లో సీనియ‌ర్ అయిన ప‌య్యావుల... రేవంత్‌ కు దిశానిర్దేశం చేశార‌న్న వాద‌న కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో రేవంత్‌ పై విరుచుకుప‌డుతున్న కేసీఆర్‌... ఏపీలో రేవంత్‌ కు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న ప‌య్యావుల‌తో ఏం మాట్లాడి ఉంటార‌న్న కోణంలో ఆస‌క్తికర వార్త‌లు రాసింది. అస‌లు వారిద్ద‌రి మ‌ధ్య ఏఏ అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌న్న విష‌యంపై ఒక్క ప‌త్రిక కూడా స్ప‌ష్టంగా ఇదీ అంశ‌మంటూ రాసిన దాఖ‌లానే లేదు. అంతేకాకుండా కాల‌వ‌ - బీకేల‌తో క‌లిసి కేసీఆర్ మాట్లాడిన అంశాల‌పై కూడా స్ప‌ష్ట‌మైన క‌థ‌నాలు రాలేద‌నే చెప్పాలి. మ‌రి ఆ చ‌ర్చ‌ల్లో ఏఏం మాట్లాడార‌న్న విష‌యం తెలియ‌కుండానే ఏవేవో క‌థ‌నాలు రాస్తే ఎలాగంటూ కొంద‌రు మండిప‌డుతున్న వైనం కూడా ఇప్పుడు మ‌న‌కు క‌నిపిస్తోంది.

అయినా పుట్ట‌ప‌ర్తి విమానాశ్ర‌యంలో ప‌య్యావుల‌తో కేసీఆర్ కాసేపు అటు ప‌క్క‌గా నిలబ‌డి మాట్లాడారు. విమానం ఎక్కే ముందు జ‌రిగిన ఈ భేటీలో పెద్ద‌గా ఆస‌క్తిక‌ర అంశాలేమీ లేవ‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా... పొగ తాగే అల‌వాటున్న కేసీఆర్‌... సిగ‌రెట్ ద‌మ్ము పీలుస్తుంటే... ప‌య్యావుల ప‌క్క‌న నిల‌బ‌డ్డార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌గా వినిపిస్తోంది. అంత నిక్క‌చ్చిగా ఎలా అంచ‌నా వేస్తున్నార‌న్న విష‌యానికి వ‌స్తే... ఆ మ‌ధ్య నవ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హాజ‌రైన కార్య‌క్ర‌మానికి కేసీఆర్ కూడా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందేగా. నాడు కూడా ఫ్లైట్ దిగిన వెంట‌నే అక్క‌డే కాస్తంత దూరంగా నిల‌బ‌డ్డ కేసీఆర్‌... చేతిలో సిగ‌రెట్‌ తో క‌నిపించారు. కేసీఆర్ ప‌క్క‌నే ఏపీ ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కూడా క‌నిపించారు. కేసీఆర్ త‌న‌కున్న అలవాటు మేర‌కు సిగ‌రెట్ పీలుస్తుంటే... త‌మ రాష్ట్రానికి వ‌చ్చిన ముఖ్య‌మైన అతిథిగా ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డ‌టం ఏపీ మంత్రుల బాధ్య‌తే క‌దా.

ఇక ఇప్పుడు ప్ర‌స్తుత అంశానికి వ‌స్తే... ప‌రిటాల కుమారుడి వివాహానికి విచ్చేస్తున్న కేసీఆర్‌ కు మ‌ర్యాద‌ల విష‌యంలో ఎలాంటి లోటు రానీయొద్ద‌ని ఏపీ సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు త‌న మంత్రివ‌ర్గానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విష‌యంలో పూర్తి బాధ్య‌త‌ల‌ను అనంత‌పురం జిల్లాకు చెందిన మంత్రిగా కాల‌వ శ్రీ‌నివాసుల‌కే అప్ప‌గించార‌ట‌. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ అనంత‌పురం జిల్లాలో కాలు పెట్టిన ద‌గ్గ‌ర‌నుంచి ఆయ‌న తిరిగి ఫ్లైట్ ఎక్కేదాకా కాల‌వ‌తో పాటు టీడీపీ జిల్లా అధ్య‌క్షుడిగా బీకే, టీడీపీలో కీల‌క నేత‌గా ఉన్న ప‌య్యావుల ఆయ‌న వెంటే ఉన్నారు. అదే స‌మ‌యంలో ఫ్లైట్ ఎక్కే ముందు కేసీఆర్ ద‌మ్ము కొడుతుంటే... ప‌య్యావుల ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డ్డార‌న్న విశ్లేషణ‌లు సాగుతున్నాయి.

అంతే త‌ప్పించి ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ఏ ఒక్క‌రిని ప్ర‌త్యేకంగా పిలిచిందేమీ లేద‌ని, ర‌హ‌స్యంగా మాట్లాడిందేమీ లేద‌న్న వాద‌న సాగుతోంది. సిగ‌రెట్ కాలుస్తున్నంత సేపు ఎలాగూ ఊరికే ఉండ‌రు కాబ‌ట్టి... ఇరు రాష్ట్రాల‌కు చెందిన ప‌లు అంశాలు వారి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిఉంటాయే త‌ప్పించి... అవేమీ అంత ప్రాధాన్యం క‌లిగిన అంశాలేమీ కాద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా గ‌తంలో పయ్యావుల‌ - బీకే - కాల‌వ‌ల‌తో పాటు కేసీఆర్ కూడా ఒకే పార్టీలో ఉన్నారు క‌దా. ఈ క్ర‌మంలో నాడు త‌మ మ‌ధ్య మొల‌కెత్తిన స్నేహం కొద్ది వారి మ‌ధ్య కుశ‌ల ప్ర‌శ్న‌లే ప‌లికి ఉంటాయ‌ని కూడా కొంద‌రు చెబుతున్నారు.