Begin typing your search above and press return to search.

మ్యాగీ నిషేధం వెనుక అసలు కారణం తెలుసా?

By:  Tupaki Desk   |   18 Nov 2015 11:30 AM GMT
మ్యాగీ నిషేధం వెనుక అసలు కారణం తెలుసా?
X
కేంద్రంలో బీజేపి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ అసహనంపై దేశమంతా వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వెనుక సాధారణ ప్రజలు ఊహించని అంశాలు ముడిపడి ఉంటున్నాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. దేశమంతా ఆదరణ పొందిన మ్యాగీ నూడుల్స్ నిషేధం విషయంలోనూ ప్రభుత్వంపై పలు ఆరోపణలు వచ్చాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు సన్నిహితుడైన యోగా గురువు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థ నూడుల్స్ ను ప్రాచుర్యంలోకి తేవడానికి మ్యాగీపై నిషేధం విధించారని విమర్శలు వచ్చాయి. అయితే... మ్యాగీ నిషేధం వెనుక అసలు కారణాలు వేరని సమాచారం.

మ్యాగి నిషేధం తరువాత మళ్లీ భారత మార్కెట్ లోకి వచ్చింది. ఈ దశలో అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న గ్రీన్ పీస్ సంస్థపై భారత్ లో విధించిన నిషేధం కొత్త ఆరోపణలకు తావిస్తోంది. ప్రశ్నించిన ప్రతిసంస్థనూ ఎన్ డీఏ ప్రభుత్వం ఇలాగే నిషేధించుకుంటూ పోతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మ్యాగీపై నిషేధం వెనుకా ఇలాంటిదే కారణం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.

మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తి చేస్తున్న సంస్థ పేరు నెస్లే. ఆ కంపెనీ ఉత్పత్తుల్లో అత్యధిక విక్రయాలు మ్యాగీవే. పౌర హక్కుల రక్షణకు పాటుపడడంతో ప్రపంచవ్యాప్తంగా ముందున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కు నెస్లే భారీగా విరాళాలు ఇస్తుంటుంది. ఈ కారణంతోనే నెస్లే పై కేంద్రం కన్నెర్ర చేసింది. ఈ ఏడాది అస్సాంలో ముస్లింలపై దాడులు - జమ్మూకాశ్మీర్ - జార్ఖండ్ - ఛత్తీస్ గఢ్ లలో గిరిజనులపై ఆకృత్యాలపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పోరాటం చేస్తోంది. తన అంతర్జాతీయ నివేదికలో పొందుపరిచి ఐక్యరాజ్య సమితికి సమర్పించింది. మణిపూర్ లో భద్రతాదళాలు చేసిన బూటకపు ఎన్ కౌంటర్ లపై కోర్టుల్లో కేసులు వేసింది. గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న భారతీయులను ఇండియన్ గవర్నమెంటు పట్టించుకోవడంలేదంటూ అంతర్జాతీయ సమాజం దృష్టికి తెచ్చింది. దీంతో ఎన్డీయే ప్రభుత్వానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే... ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కు అంతర్జాతీయంగా మంచి పేరుండడం.. అంతర్జాతీయ సంస్థతో నేరుగా గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక దానికి నిధులిస్తున్న దాతలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఆమ్నెస్టీకి పెద్ద మొత్తంలో విరాళాలిచ్చే నెస్లేను దెబ్బతీసి భయపెట్టాలని మ్యాగీని నిషేధించినట్లు చెబుతున్నారు.

ఇండియాలో 400కి పైగా ఆహార ఉత్పత్తుల్లో పరిమితికి మించి రసాయనాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. అందులో మ్యాగీ కూడా ఒకటి. అయితే.. కేవలం మ్యాగీని మాత్రమే నిషేధించి మిగతావాటిని విడిచిపెట్టారు. దీంతో ఇది నెస్లే ద్వారా ఆమ్నెస్టీని బెదిరించడానికి చేశారని స్పష్టమవుతోంది.

తాజాగా గ్రీన్ పీస్ సంస్థపైనా వేటు వేసింది. గ్రీన్ పీస్ కూడా అంతర్జాతీయ స్తాయి సామాజిక సంస్థ. ఇది ఇండియాలో కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. పర్యావరణ పరిరక్షనకు ఉద్యమాలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 1200 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పడుతుంటే అందులో 650 ఇండియాలోనే తయారవుతున్నాయన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. అందుకే ఆ సంస్థపైనా వేటేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.