Begin typing your search above and press return to search.

అస‌లు 2జీ కేసు ఏంటంటే...

By:  Tupaki Desk   |   21 Dec 2017 11:30 PM GMT
అస‌లు 2జీ కేసు ఏంటంటే...
X
కాంగ్రెస్ సార‌థ్యంలోని యూపీఏ హయాంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ కూడా ఒకటి. ఈ స్కామ్ విలువ ఏకంగా రూ.లక్షా 76 వేల కోట్లు. 2008 నాటిదీ స్కామ్. ఇందులో ప్రధాన నిందితులు అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎ.రాజా - డీఎంకే అధినేత కరుణానిధి కూతురు కనిమొళి. 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల జారీలో కొన్ని చట్టాలను ఉల్లంఘించారని - భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు అర్హత లేని - టెలికాం రంగంలో అనుభవం లేని యూనిటెక్ అండ్ స్వాన్ టెలికామ్ కంపెనీకి లేదా ముందుగానే దీనికి సంబంధించిన సమాచారం ఉన్న కంపెనీలకు అక్రమంగా లైసెన్సులు కట్టబెట్టినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది.

కాగ్ నివేదిక ప్ర‌కారం 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు సీబీఐ నమోదు చేయగా.. మూడోది ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసింది. ఆరేండ్ల కిందట సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు చేయడంతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. మొదటి కేసులో రాజా - కనిమొళితోపాటు నాటి టెలికంశాఖ కార్యదర్శి సిద్ధార్థ బెహుర - రాజా ప్రైవేటు సెక్రటరీ ఆర్కే చందోలియా - స్వాన్ టెలికాం ప్రమోటర్స్ షాహిద్ ఉస్మాన్ బల్వా - వినోద్ గోయెంకా - యునీటెక్ లిమిటెడ్ ఎండీ సంజీవ్ చంద్ర - ఆర్‌ ఏడీఏజీకు చెందిన గౌతమ్ దోషి - సురేంద్ర పిపర - హరి నాయర్ - కుసెగావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటెబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆసిఫ్ బల్వా - రాజీవ్ అగర్వాల్ - కలైంజ్ఞర్ టీవీ డైరెక్టర్ శరత్‌ కుమార్ - బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ నిందితులుగా ఉన్నారు. ఈ 14 మంది వ్యక్తులతోపాటు స్వాన్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్(ఎస్టీపీఎల్) - రిలయన్స్ టెలికమ్ లిమిటెడ్ - యునీటెక్ వైర్‌ లెస్ (తమిళనాడు) లిమిటెడ్ కంపెనీలపై సీబీఐ అభియోగాలు మోపింది. 122 లైసెన్సులను ఇవ్వడం ద్వారా రూ.30,984 కోట్ల నష్టం వాటిల్లినట్టు సీబీఐ చార్జిషీట్‌ లో తెలిపింది. అనంతరం ఆర్‌ ఏడీఏజీ చైర్మన్ అనిల్ అంబానీ - ఆయన సతీమణి టీనా అంబానీ - కార్పొరెట్ లాబీయిస్ట్ నీరా రాడియాతోపాటు 154 మంది సాక్షుల వాంగ్మూలాలను సుప్రీంకోర్టు రికార్డు చేసింది. ఈ కేసులో నిందితులకు కోర్టు ఆరు నెలల నుంచి జీవితఖైదు విధించే అవకాశాలు ఉన్నాయి.

సీబీఐ రెండో కేసులో.. ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్లు రవి రూయా - అన్షుమన్ రూయా - లూప్ టెలికమ్ ప్రమోటర్లు కిరణ్ ఖైతాన్ - ఆమె భర్త ఐపీ ఖైతాన్ - ఎస్సార్ గ్రూప్ డైరెక్టర్ (స్ట్రాటజీ అండ్ ప్లానింగ్) వికాస్ సరఫ్‌ తోపాటు లూప్ టెలికం లిమిటెడ్ - లూప్ మొబైల్ ఇండియా లిమిటెడ్ - ఎస్సార్ టెలీహోల్డింగ్ లిమిటెడ్ (ఈటీహెచ్‌ ఎల్) కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చారు. మూడో కేసు విషయానికి వస్తే.. ఏప్రిల్ 2014న 19 మందిపై ఈడీ చార్జిషీట్ నమోదు చేసింది. డీఎంకే పార్టీకి చెందిన కలైంజ్ఞర్ టీవీలో ఎస్టీపీఎల్ కంపెనీ రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టిన కేసులో డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ పేరును ఈడీ చార్జిషీట్‌ లో చేర్చింది. మనీలాండరింగ్ ప్రివెన్షన్ యాక్టు కింద ఈడీ తన తుది నివేదికలో మొత్తం 10మంది వ్యక్తులను - 9 కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చింది.