Begin typing your search above and press return to search.

ఢిల్లీ వేదిక‌గా తెర వెనుక ఏదో జ‌రుగుతోందా?

By:  Tupaki Desk   |   31 Oct 2018 3:30 PM GMT
ఢిల్లీ వేదిక‌గా తెర వెనుక ఏదో జ‌రుగుతోందా?
X
పేప‌ర్లో కావొచ్చు.. న్యూస్ ఛాన‌ళ్ల‌లో కావొచ్చు.. కంటి ముందు క‌నిపించే వాటి వెనుక అస‌లు దృశ్యం వేరే ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌.. ఏపీ ముఖ్య‌మంత్రి ఢిల్లీ టూర్ ..లాంటి స్క్రోలింగ్స్ మామూలుగా క‌నిపించినా.. దాని వెనుక ఒక ఉద్దేశం ఉండ‌కుండా ఉండ‌దు.

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. హుటాహుటిన కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లిన‌ట్లు? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు సైతం ఢిల్లీకి మ‌రోసారి వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తిని మ‌ర్చిపోకూడ‌దు. ఎందుకిలా? అంటే.. తెర వెనుక ముచ్చ‌ట్లు చాలానే ఉంటాయ‌ని చెప్పాలి.

చంద్రుళ్ల ఢిల్లీ టూర్ల మీద ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వినిపిస్తున్న వేళ‌.. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ సైతం ఢిల్లీకి వెళ్ల‌టం మ‌ర్చిపోకూడ‌దు. ఇంత‌కీ.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

తెర మీద క‌నిపిస్తున్న అంశాల‌కు.. తెర వెనుక జ‌రుగుతున్న అంశాల‌కు మ‌ధ్య‌న పోలిక ఉండ‌ద‌ని చెబుతున్నారు. ఎవ‌రి దాకానో ఎందుకు కేసీఆర్ సంగ‌తే చూడండి. కంటి.. పంటి స‌మ‌స్య‌ల మీద ఢిల్లీకి వెళ్లిన‌ట్లుగా చెప్పారు. ఈ రెండు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం దేశ విదేశాల నుంచి ప్ర‌ముఖులు హైద‌రాబాద్‌ కు వ‌స్తుంటే.. ఆయ‌న మాత్రం ఢిల్లీకి వెళ్ల‌టం ఏమిటి? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.

కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సోద‌రి ప్రియాంక వాద్రా త‌న కుమారుడికి కంటి గాయ‌మైతే.. వారు ప్ర‌త్యేక విమానంలో హైద‌రాబాద్ వ‌చ్చి ఎల్వీ ప్ర‌సాద్ ఐ ఇనిస్టిట్యూట్ లో చెక్ చేయించుకొని మ‌రీ వెళ్ల‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇలా ఎంతోమంది ప్ర‌ముఖులు ఉన్న హైద‌రాబాద్‌ ను వ‌దిలేసి ఢిల్లీకి ఎందుకు వెళ్లిన‌ట్లు? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌.

నిజంగానే త‌న‌కు న‌మ్మ‌కం ఉన్న వైద్యులు ఉండ‌టంతో వెళ్లార‌నే అనుకుందాం. మ‌రి.. త‌న ఆరోగ్య ప‌రిస్థితి మీద ఎప్ప‌టి మాదిరి వైద్యులు ఏమ‌న్నార‌న్న విష‌యాన్ని ఎందుకు వెల్ల‌డించ‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌.

ఆ మ‌ధ్య‌న త‌న తండ్రికి కంటికి జ‌రిగిన చికిత్స గురించి కేటీఆర్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. వైద్యుల‌కు థ్యాంక్స్ చెప్ప‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అలాంటిది తాజా టూర్ విష‌యంలో ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు. చివ‌ర‌కు కేసీఆర్ ఢిల్లీకి వెళుతున్న ఫోటోలు.. తిరిగి వ‌స్తున్న దానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు విడుద‌ల కాక‌పోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్ర‌ధాని మోడీ తీరుపై తాను జాతీయ మీడియాతో మాట్లాడ‌తాన‌ని చెప్పి. . ఢిల్లీకి వెళ్లి హ‌డావుడి చేసిన చంద్ర‌బాబు.. నాలుగు రోజులు తిర‌గ‌క‌ముందే మ‌రోసారి ఢిల్లీ టూర్ పెట్టుకోవ‌టం గ‌మ‌నార్హం. మొద‌ట గ‌వ‌ర్న‌ర్‌? ఆ త‌ర్వాత చంద్ర‌బాబు.. త‌ర్వాత కేసీఆర్‌.. మ‌ళ్లీ చంద్ర‌బాబు వ‌రుస పెట్టి ఢిల్లీకి టూర్లు వెళ్ల‌టం వెనుక అస‌లు విష‌యం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. మొత్తంగా చూస్తే.. ఒక్క విష‌యం మాత్రం అర్థం కాక మాన‌దు. ఢిల్లీ కేంద్రంగా ఏదో జ‌రుగుతోంది? అదేమిట‌న్న‌ది అంతుబ‌ట్ట‌నిదిగా మారింది. టీవీ స్క్రోలింగ్‌ల‌కు భిన్న‌మైన అంశం ఏదో జ‌రుగుతుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి.. అదెప్ప‌టికి బ‌య‌ట‌కు వ‌స్తుందో చూడాలి.