Begin typing your search above and press return to search.

నీర‌వ్ కుట్ర‌ను త‌వ్వితే తేల‌ని ప్ర‌శ్న‌లెన్నో?

By:  Tupaki Desk   |   17 Feb 2018 7:13 AM GMT
నీర‌వ్ కుట్ర‌ను త‌వ్వితే తేల‌ని ప్ర‌శ్న‌లెన్నో?
X
ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.11వేల కోట్ల‌కు పైనే భారీ కుంభ‌కోణం బ‌య‌ట‌కు రావ‌టంతో యావ‌త్ దేశం నివ్వెర‌పోయింది. దేశానికి ర‌క్ష‌కుడిగా మోడీ లాంటి ప్ర‌ధాని ఉన్న వేళ‌.. ఆయ‌న పేరుతో ఉండే నీర‌వ్ మోడీ అనే గుజ‌రాత్ వ్యాపారి చేసిన ఆర్థిక దోపిడీ రేపుతున్న ప్ర‌శ్న‌లు ఎన్నో...

ఈ భారీ కుంభ‌కోణం ఎలా జ‌రిగింద‌న్న‌ది మూడు ముక్క‌ల్లో చెప్పాలంటే.. బ్యాంకు జారీ చేసే ప‌త్రాన్ని (మా ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉన్నాయి. ఈ మొత్తానికి స‌రిప‌డా మీరు డ‌బ్బులు చెల్లిస్తే మేం మీకు డ‌బ్బులిస్తాం అంటూ బ్యాంకు ఇచ్చే అధికార ప‌త్రం) విదేశాల్లోని భార‌త బ్యాంకుల‌కు ఇచ్చి డ‌బ్బులు తీసుకోవ‌టం. ఇదేదో ఒక‌టి రెండుసార్లు కాకుండా

వంద‌లాదిసార్లు.. వేలాది కోట్ల రూపాయిల‌తో జ‌ర‌గ‌టం పెద్ద ప్ర‌శ్న‌.

ఈ భారీ కుంభ‌కోణంలో ఒక్క పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ అధికారుల పాత్ర మాత్ర‌మే ఉందంటే న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని చెప్పాలి. ఇంత పెద్ద కుంభ‌కోణంలో ఒక బ్యాంకు అధికారులు స‌హ‌క‌రిస్తేనే ఈ స్కాం ఇన్నేళ్లుగా సాగటం క‌ష్టం. ఎందుకంటే.. న‌కిలీ ప‌త్రాలు ప‌ట్టుకొని విదేశాల‌కు వెళ్లి.. వేరే భార‌తీయ బ్యాంకులకు ప‌త్రాల్ని (ఎల్‌ ఒయు) చూపించ‌గానే డ‌బ్బులు ఇచ్చేశార‌ని అనుకుందాం. మ‌రి.. ఆ డ‌బ్బుల్ని తిరిగి తీసుకోవ‌టానికి స‌ద‌రు బ్యాంకులు ప్ర‌య‌త్నం చేయాలి క‌దా? అప్పుడైనా ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రావాలి క‌దా? అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఇవే కాదు.. ఈ కుంభ‌కోణాన్ని నిశితంగా ప‌రిశీలిస్తే వ‌చ్చే ప్ర‌శ్న‌లెన్నో. అలాంటివి చూస్తే.. ఈ స్కాంలో ఒక నీర‌వ్ మోడీ.. మ‌రికొంద‌రు పంజాబ్ బ్యాంకు కీల‌క అధికారుల‌తో న‌డిచే వ్య‌వ‌హారం కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నో ప్ర‌శ్న‌లు.. మ‌రెన్నో సందేహాల‌కు తెర తీయ‌ట‌మే కాదు ఈ స్కాంను కొత్త కోణంలో చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పేలా ఉండే అంశాలు చూస్తే..

+ ఈ కుంభ‌కోణంలో ఇద్ద‌రు ఉద్యోగులు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ చెబుతోంది. అదే స‌మ‌యంలో ఈ స్కాం 2011 నుంచి సాగుతున్న‌ట్లు చెప్పారు. మ‌రి అలాంట‌ప్పుడు పంజాబ్ బ్యాంక్ జారీ చేసిన ఎల్ ఓయూల ఆధారంగా మోడీ కంపెనీల‌కు ఫారెక్స్ రుణాలు స‌మ‌కూర్చిన బ్యాంకులు ఒక్క‌సారి కూడా తాము చెల్లించిన సొమ్ము కోసం పంజాబ్ బ్యాంక్‌ను అడ‌గ‌లేదా?

+ ఒక‌ట్రెండుసార్లు ప‌రిమిత మొత్తాన్ని అడ్డ‌దారిలో తీసుకుంటే.. అది బ‌య‌ట‌కు రాలేదంటే న‌మ్మొచ్చు. కానీ.. ఏడేళ్లుగా పంజాబ్ బ్యాంక్ జారీ చేసిన ఎల్ ఓయూలకు సంబంధించి స్విఫ్ట్ లావాదేవీలు.. కోర్ బ్యాంకింగ్ సిస్ట‌మ్ లో న‌మోదూన లావాదేవీల మ‌ధ్య ఉన్న తేడాల్ని ఎందుకు గుర్తించ‌లేక‌పోయారు?

+ ఆరేడేళ్లుగా పంజాబ్ బ్యాంక్ ప‌ద్దుల ఆడిటింగ్‌..వార్షిక బ్యాలెన్స్ షీట్ తయారీ సంద‌ర్భాల్లో ఈ తేడా వ్య‌వ‌హారం ఎందుకు బ‌య‌ట‌కు రాలేదు?

+ బ్యాంకు ప‌ద్దుల్ని ఆర్ బీఐ క్షుణ్ణంగా ఆడిట్ చేయ‌టం మామూలే. మ‌రి.. ఆర్ బీఐకి కూడా ఈ వ్యవ‌హారం ఎందుకు దొర‌క‌న‌ట్లు? అంటే.. ఆర్ బీఐ విశ్వ‌స‌నీయ‌త‌ను కూడా సందేహించాలా?

+ ఈ స్కాం బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చింద‌న్న విష‌యానికి పంజాబ్ బ్యాంక్ అధికారులు చెప్పిందేమంటే.. ఎలాంటి గ్యారెంటీలు లేకుండా ఎల్ ఓయూల‌ను ఇవ్వాల‌ని కోరుతూ నీర‌వ్ మోడీ ప్ర‌తినిధులు బ్యాంకుకు రావ‌టంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ అదే నిజ‌మ‌ని అనుకుందాం. త‌మకింత కాలం బ్యాంకులో స‌హ‌క‌రిస్తున్న అధికారి రిటైర్ అయిన విష‌యం నీర‌వ్ గ్యాంగ్‌ కు తెలీకుండా ఉంటుందా? ఒక‌వేళ తెలిసిన త‌ర్వాత కూడా బ్యాంకుకు వ‌చ్చారంటే.. ఏ ధీమాతో వ‌చ్చి ఉంటారు?

+ పంజాబ్ ప‌ద్దులు.. బోగ‌స్ ఎల్ ఓయూల ఆధారంగా రుణాలు ఇవ్వ‌టం.. మోడీ కంపెనీలు.. గీతాంజ‌లి జువెల‌ర్స్ ప‌ద్దుల్ని ప్ర‌తి ఏటా ఆడిట‌ర్స్ త‌నిఖీలు చేస్తున్న‌ప్పుడు ఈ విష‌యం ఎందుకు బ‌య‌ట‌కు రాన‌ట్లు? ఈ మొత్తం ఇష్యూలో ఆడిట‌ర్ల పాత్ర ఏమిటి?

+ ఈ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డిన‌ప్పుడు ఒక జూనియ‌ర్ అధికారి కీల‌క పాత్ర పోషించార‌ని చెప్పిన పంజాబ్ బ్యాంక్‌.. త‌ర్వాత ఇద్ద‌రు ఉద్యోగుల‌ని చెప్పింది. ఇప్పుడేమో 18 మందిని స‌స్పెండ్ చేసింది. ఈ లెక్క‌న రానున్న రోజుల్లో మ‌రెన్ని త‌ల‌లు తెగుతాయో?

+ పంజాబ్ బ్యాంక్ చెప్పినంత సింఫుల్ గా.. అమాయ‌కంగా ఈ స్కాం జ‌రిగిందా?

+ ఎంత బ‌రితెగించినా చిన్న‌స్థాయి అధికారులు రూ.11వేల కోట్ల‌కు పైనే కుంభ‌కోణాన్ని చేయ‌గ‌ల‌రా? ఒక‌వేళ చేస్తున్నారే అనుకుందాం.. మ‌రి కీల‌క స్థానాల్లో ఉన్న వారు దాన్ని గుర్తించ‌క‌పోవ‌టం ఏమిటి?

+ ఈ స్కాంకు సంబంధించిన వివ‌రాలు 2016లొనే ప్ర‌భుత్వానికి అందిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి.. ప్ర‌భుత్వం.. నిఘా వ్య‌వ‌స్థ‌లు అప్ప‌టి నుంచి ఏం చేస్తున్న‌ట్లు?

+ తీవ్ర‌మైన నేరం చేసిన‌ట్లుగా స‌మాచారం ఉన్న‌ప్పుడు .. అత‌డిపై డేగ క‌న్ను వేయ‌టంతో పాటు.. అత‌ను దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్య‌త నిఘా వ్య‌వ‌స్థ‌కు ఉంటుంది. నాడు మాల్యా విష‌యంలోనూ.. నేడు నీర‌వ్ మోడీ విష‌యంలోనూ నిఘా వ్య‌వ‌స్థ‌ల వైఫ‌ల్యం దేనికి నిద‌ర్శ‌నం?

+ బ్యాంకుల్లో కొల్ల‌గొట్టిన ధ‌నాన్ని నీర‌వ్ మోడీ ఏం చేశారు? ఎక్క‌డికి మ‌ళ్లించారు? ఎక్క‌డ దాచారు? ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టారు? ఆ మొత్తాన్ని ఏం చేశారు?

+ ఈ కుంభ‌కోణం సైజు చూస్తుంటే ఒక్క పంజాబ్ బ్యాంక్ తోనే ప‌రిమిత‌మ‌య్యేట‌ట్లు క‌నిపించ‌ట్లేదు. మ‌రెన్ని బ్యాంకుల పాత్ర ఉంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఒక‌వేళ ఈ సందేహ‌మే నిజ‌మైతే.. దేశ బ్యాంకింగ్ రంగంపై స‌రికొత్త అనుమానాలు రేకెత్త‌టం ఖాయం.