Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎంసెట్ లీకు సంచలన నిజాలు

By:  Tupaki Desk   |   28 July 2016 5:19 AM GMT
తెలంగాణ ఎంసెట్ లీకు సంచలన నిజాలు
X
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 పేపర్ ముందుగా లీక్ అయిందన్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటివరకూ లీకు మీద సందేహాలతో కూడిన వార్తలు నిజమేనని.. లీకు వెనుక పెద్ద కుట్ర ఉందన్న విషయాన్ని సీఐడీ దర్యాప్తులో తేలింది. సంచలనం సృష్టించిన ఈ ఉదంతం నేపథ్యంలో ఎంసెట్ 2ను రద్దు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు.. ఎంసెట్ 1కు కూడా లీకేజీ మరక అంటిందన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజా లీకు నేపథ్యంలో ఎంసెట్ 2ను రద్దు చేయటంపై విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇక.. ఎంసెట్ 2 ఎలా లీక్ అయ్యింది?ఎంత మంది విద్యార్థులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉంది? వారు ఎంత మొత్తాన్ని వెచ్చించారు? దీనికి బాధ్యులు ఎవరు? అన్న విషయాల్లోకి వెళితే..

ఏమిటీ ఇష్యూ.. సూత్రధారి ఎవరు?

మెడికల్ కాలేజీ ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ 2 పరీక్షా పత్రం.. పరీక్షకు రెండురోజుల ముందే గుట్టుచప్పుడు కాకుండా బయటకురావటం. ఈ వ్యవహారంలో సూత్రధారి 2014లో పీజీ మెడికల్ సెట్ పశ్నాపత్రం లీకేజీలోకీలకంగా వ్యవహరించినా రాజగోపాల్ రెడ్డి.. తాజా లీకుకు సూత్రధారిగా తేల్చారు. ఈ లీకేజీతో అతనితో పాటు.. దాదాపు ఎనిమిది మంది వరకూ ప్రమేయం ఉందని తేల్చారు. వీరిలో నలుగురిని ఇప్పటికే సీఐడీ అదుపులోకి తీసుకుంది.

ఎలా లీక్ అయ్యింది.. డీల్ ఎలా?

ఎంసెట్ 2 పరీక్ష నిర్వహణకు రెండు రోజుల ముందే ప్రశ్నా పత్రం లీక్ అయ్యింది. ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నా పత్రాన్ని గుట్టుచప్పుడు కాకుండా బయటకు తీసుకొచ్చారు. ప్రశ్నాపత్రం బయటకు రావటంతో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు.. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి బ్రోకర్లు ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

మూడింటిలో ఒక్కటిని ఎలా అధిగమించారు?

ఎంసెట్ లాంటి పరీక్షల్లో మూడు వేర్వేరు ప్రశ్నాపత్రాల్ని తయారు చేస్తారు. వీటిల్లో ఒక్కదాన్ని ఎంపిక చేస్తారు. అది కూడా పరీక్ష జరగటానికి కొద్ది సమయం ముందు మాత్రమే. మరి.. అలాంటప్పుడు ఈ లీకు ఎలా సాధ్యమైందన్నప్రశ్నకు సమాధానం వెతికితే.. డీల్ కుదర్చుకున్న బ్రోకర్లు మొత్తం మూడు పేపర్లను బయటకు తీసుకు రావటం గమనార్హం.

ఎలా ప్రిపేర్ చేశారు?

డీల్ కుదుర్చుకున్న విద్యార్థులను పరీక్షకు రెండు రోజులు ముందుగా విమానాల్లో ముంబయి.. బెంగళూరులోని రహస్య ప్రాంతాలకు తరలించారు. వారికి అక్కడ ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చారు. మూడు సెట్లను పేపర్లలో దేనినైనా ఎంపిక చేసే నేపథ్యంలో.. మూడు ప్రశ్నాపత్రాలపై కోచింగ్ ఇచ్చారు.

ఎంతమంది లబ్థి పొందారు?

ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంలో 72 మంది విద్యార్థుల వరకూ లబ్థి పొందినట్లు తేలింది. ఒక్కో విద్యార్థి రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షల మధ్య వరకు బ్రోకర్లు డీల్ కుదుర్చుకోవటం గమనార్హం. ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంలో రూ.50కోట్లచెబుతున్నారు. మేర కుంభకోణం జరిగిందని చెబుతున్నారు.

ఏం చేయనున్నారు?

ఇప్పటివరకూ లీకేజీకి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారిపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు లీక్ కు కారణమైన విద్యార్థుల తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ఇక.. ఈ లీకు వ్యవహారంలో సంబంధం ఉందని భావిస్తున్న జేఎన్ టీయూలో పని చేసే సిబ్బంది పాత్రపై మాత్రం స్పష్టత రావటం లేదు. ఇప్పటికే ఈ స్కాంలో భాగస్వామ్యమైన విద్యార్థులను.. వారి తల్లిదండ్రులను విచారిస్తున్న అధికారులు వారిపై కేసులు నమోదుచేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఎంసెట్ 2ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.