Begin typing your search above and press return to search.

ఎంఐఎం మ‌త‌ రాజ‌కీయాలు..ప‌క్క రాష్ట్రంలో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   30 Nov 2018 5:03 PM GMT
ఎంఐఎం మ‌త‌ రాజ‌కీయాలు..ప‌క్క రాష్ట్రంలో క‌ల‌క‌లం
X
పొరుగు రాష్ట్రమైన మ‌హారాష్ట్రలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ముందుగా మాట ఇచ్చినట్లే మరాఠాలకు శుభవార్త అందించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. విద్య - ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ బిల్లును మండలి ఆమోదం కోసం పంపించింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన కొద్ది సేపటికే మూజువాణి ఓటు ద్వారా దానిని పాస్ చేయడం విశేషం. ఈ బిల్లుకు మద్దతిచ్చిన రాజకీయ పార్టీలన్నింటికీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు.

అయితే, ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ చోటు చేసుకుంది. మహారాష్ట్రలో తాజాగా మరాఠాల రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో అక్కడి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎంఐఎం పార్టీ బాంబే హైకోర్టును ఆశ్రయిస్తోంది.`` మేం మరాఠాల రిజర్వేషన్‌ ను సవాల్ చేయం.. ముస్లిం రిజర్వేషన్ ఎందుకు అవసరమో లెక్కలతో సహా వివరిస్తూ కోర్టుకు వెళతాం`` అని మహారాష్ట్ర ఎంఐఎం నేత ఇంతియాజ్ అలీ చెప్పారు. అయితే - మరాఠాలకు సామాజికంగా - ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కింది మహారాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపిన అనంత‌రం ఎంఐఎం ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కావాలని అనడంపై సీఎం ఫడ్నవీస్ అసహనం వ్యక్తం చేశారు. విపక్షాలు వెనుకాముందు చూడకుండా ముస్లింలను రెచ్చగొడుతున్నాయని అయన మండిప‌డ్డారు. కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే విపక్షాలు ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని భుజాలకెత్తుకున్నాయని మహా సీఎం దుయ్యబట్టారు.

కాగా, మహారాష్ట్ర ముస్లింలు 5 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్‌ ను కొట్టిపారేయడంలో ప్రభుత్వ పక్షపాత ధోరణి కనిపిస్తున్నదని ముస్లిం నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్ ఎజెండాతో పనిచేస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మల్యే ఆరిఫ్ నసీంఖాన్ ఆరోపించారు. ముస్లింలకు ఎలాంటి సాధికారత లబించకుండా చూడలన్నదే ఆరెస్సెస్ అభిమతమని అన్నారు.ఇదిలాఉండ‌గా, మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కొన్నాళ్లుగా మహారాష్ట్రలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ధన్‌ గర్ సామాజిక వర్గానికి చెందిన రిజర్వేషన్ల అంశం కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది.