Begin typing your search above and press return to search.

దాని బాధ్యత అప్పగిస్తే ఫడ్నవీస్ కూడా శివసేనకు ఓటేస్తారు.. ఫైర్ బ్రాండ్ ఫైర్

By:  Tupaki Desk   |   13 Jun 2022 4:16 AM GMT
దాని బాధ్యత అప్పగిస్తే ఫడ్నవీస్ కూడా శివసేనకు ఓటేస్తారు.. ఫైర్ బ్రాండ్ ఫైర్
X
కడుపు రగిలిపోతున్నప్పుడు కొందరి నోటి నుంచి వచ్చే మాటల్ని వినలేక రామ.. రామ అనేస్తుంటాం. అదే సమయంలో మరికొందరు మాత్రం ఎప్పుడూ.. ఎవరూ ఊహించని రీతిలో రియాక్టు అవుతూ.. వారి మేధోతనానని బయటకు తీసి అబ్బురపడుస్తుంటారు.

ఆ కోవలోకే వస్తారు శివసేన ఫైర్ బ్రాండ్ కమ్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్. తాజాగా ముగిసిన రాజ్యసభ ఎన్నికల్లో మహారాష్ట్ర బీజేపీ అనూహ్యంగా తమకు అవకాశం ఉన్న దానికి మించి ఒక స్థానాన్ని తమ సొంతం చేసుకోవటం.. సేన అభ్యర్థి ఓడేలా చేసి షాకివ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాట్లాడిన రౌత్.. ఘాటు విమర్శలు చేశారు.

తమకు ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ నియంత్రణ బాధ్యతల్ని తమ పార్టీకి అప్పగిస్తే.. బీజేపీ నేత.. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం తమకే ఓటేస్తారంటూ తిరుగులేని పంచ్ ను సంధించారు. తాజా రాజ్యసభ ఎన్నికల్లో శివసేన పార్టీ అభ్యర్థి విజయం సాధించాల్సి ఉన్నా.. తెర వెనుక ఫడ్నవీస్ కారణంగా అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకోవటంతో పాటు.. గెలుపునకు ఏ మాత్రం అవకాశం లేని బీజేపీ అభ్యర్థి గెలిచేలా చేశారు.

చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు.. ఇండిపెండెంట్లతో పాటు శివసేనకు చెందిన కొందరితో కలిపి బీజేపీ అభ్యర్థి విజయం సాధించేలా చేశారు. ఈడీ నియంత్రణను తమ పార్టీకి రెండు రోజుల పాటు అప్పగిస్తే.. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తమకు ఓటేస్తారన్నారు. తమ పార్టీలోనే ఉండి తమకు ఓటు వేయని వారి గురించి తెలుసని.. వారికి ఎలాంటి ప్రలోభాలకు గురి చేశారో తమకు తెలుసన్నారు.

బహుజన్ వికాస్ అఘాడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు తమ అభ్యర్థికి ఓటు వేయలేదన్నారు. ఈ పరిణామంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే బాధ పడుతున్నట్లుగా ఆయన వెల్లడించారు.

ఏమైనా.. సంజయ్ రౌత్ లాజిక్ అందరికి కనెక్టు కావటమే కాదు.. ఇటీవల కాలంలో కేంద్ర విచారణ సంస్థల్ని మోడీ సర్కారు తమ రాజకీయ ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారన్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి వేళ.. రౌత్ నోటి నుంచి వచ్చిన మాటలు సంచలనంగా మారాయి.