Begin typing your search above and press return to search.

దీదీ అడ్డాలో ప‌రిస్థితిని సినిమా ఫోటోతో చెప్పింది

By:  Tupaki Desk   |   7 July 2017 10:02 PM IST
దీదీ అడ్డాలో ప‌రిస్థితిని సినిమా ఫోటోతో చెప్పింది
X
రాజ‌కీయం కోసం రెచ్చ‌గొట్టే తీరు అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఇలాంటి రెచ్చ‌గొట్టే వాటిని గ‌తంలో అయితే మీడియా ఎంతోకొంత కంట్రోల్ చేసేది. కానీ.. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇప్పుడా ప‌రిస్థితి మారిపోయింది. ఎవ‌రికి ఏం న‌చ్చితే దాన్ని పోస్ట్ చేసే అవ‌కాశం ఉండ‌టంతో ఎవ‌రికి వారు చెల‌రేగిపోతున్నారు. బాధ్య‌తాయుత స్థానాల్లో ఉన్న వారు ఎంత బాధ్య‌త‌గా ఉండాల‌న్న ప్రాధమిక‌ విష‌యాన్ని మ‌ర్చిపోతున్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్ లో హిందువుల ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? అంటూ బీజేపీ మ‌హిళా నేత ఒక‌రు పెట్టిన పోస్ట్ ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. తృణ‌మూల్‌కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ పాల‌న‌ను త‌ప్పు ప‌డుతూ.. హ‌ర్యానా బీజేపీ మ‌హిళా నేత విజేత మాలిక్ పెట్టిన ఫోటో ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా ఉంది.

భోజ్ పురి సినిమా అయిన ఔర‌త్ ఖిలోనా న‌హీ చిత్రంలోని ఒక ఫోటోను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఒక నిస్సహాయ మ‌హిళ‌ను బ‌హిరంగంగా.. చీర లాగేస్తున్న ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. బెంగాల్ లో హిందువుల ప‌రిస్థితి దారుణంగా ఉందంటూ కామెంట్ పెట్టారు. హిందువుల‌ను బ‌హిరంగంగా వేధిస్తున్నార‌ని.. అక్క‌డ జ‌రుగుతున్న దాడుల్ని దీదీ స‌ర్కారు అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని వాపోయారు.

సోష‌ల్ మీడియాలో మాలిక్ పెట్టిన అభ్యంత‌ర‌క‌ర ఫోటోపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచేలా ఉన్న ఫోటోల్ని ఎలా పోస్ట్ చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. హింస‌ను ప్రేరేపించేలా ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన ఆమెపై కేసు న‌మోదు చేసి.. అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్న వాళ్లు లేక‌పోలేదు. అయితే.. ఇంత ర‌చ్చ న‌డుస్తున్నా.. బీజేపీ నేత‌లు మాత్రం పెద‌వి విప్ప‌టం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ లో ఒక కొస‌మెరుపు లాంటి విష‌యాన్ని చెప్పాలి. దీదీ ఇలాకాలో ఎంత దారుణ ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యాన్ని చెప్పే క్ర‌మంలో పోస్ట్ చేసిన ఫోటోకు చెందిన మూవీలో ఢిల్లీ బీజేపీ అధ్య‌క్షుడు మ‌నోజ్ తివారి న‌టించ‌టం విశేషంగా చెప్పాలి.