Begin typing your search above and press return to search.

ఇదే.. పరమాన్నం బాబా డెమో

By:  Tupaki Desk   |   19 Jun 2016 7:18 AM
ఇదే.. పరమాన్నం బాబా డెమో
X
సంపన్నుల్ని.. పలువురు ప్రముఖుల్ని తన మాటలతో బోల్తా కొట్టించే పరామాన్నం బాబా యవ్వారాల్ని త్వరగా ఎలా నమ్మేవారు? వారిని ఎలా నమ్మించేవారు? అన్నది పెద్ద ప్రశ్న. తాజాగా అతన్ని విచారించిన పోలీసులకు షాకిస్తూ.. తాను బురిడీ కొట్టే విధానాన్ని పరమాన్నం బాబా అలియాస్ శివ వివరంగా చెప్పుకొచ్చాడు. తనను నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఎలా పెడతారన్న ప్రశ్నతో పాటు.. ఎలా నమ్మకం కలిగిస్తాడన్న అంశాన్ని చూస్తే..

తనకు పరిచయమై.. తన మాటల ప్రభావానికి గురై.. తనతో పూజ చేయించుకునే వారికి డెమో పేరుతో మొదట ఎరవేస్తాడు. ఇందులో భాగంగా మొదట కొద్దిపాటి మొత్తాన్ని పూజలో పెట్టటం.. దాన్ని తన దగ్గరఉన్న డబ్బుతో డబుల్ చేసి.. వారిలో ఆశలు పెంచేలా చేసి.. వారిని మాయలో ఉంచేసి మాయమైపోవటం శివకు అలవాటు.

డబ్బుల్ని డబుల్ చేసే విషయంలో తన క్లయింట్లను శివ ఎలా నమ్మిస్తాడన్నది చూసినప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా అనిపించక మానదు. పూజ సమయంలో లుంగీ కట్టుకునే పరమాన్నం బాబా.. పూలు.. రబ్బర్ బ్యాండ్లతో డబ్బుల్ని తొడల దగ్గర కట్టుకుంటాడు. పూజలో కూర్చొన్న కాసేపటికి.. క్లయింట్ల చూపుల్ని మరల్చి.. రబ్బర్ బ్యాండ్లను తొలగించి.. తొడల దగ్గర పెట్టుకున్న డబ్బును పూజలో ఉంచిన డబ్బుకు జత చేస్తాడు. అనంతరం వారు తన ట్రాప్ లో పడ్డాక.. తర్వాతి పూజలో పెద్ద మొత్తాన్ని పెట్టటం.. దాన్ని మాయ మాటలు చెప్పేసి ఉడాయించేస్తాడట.