Begin typing your search above and press return to search.

కరోనా బాబా.. నిమ్మకాయలు.. తాయోత్తులతో వైరస్ ఖతమంట!

By:  Tupaki Desk   |   26 July 2020 11:50 AM GMT
కరోనా బాబా.. నిమ్మకాయలు.. తాయోత్తులతో వైరస్ ఖతమంట!
X
అందరినీ ఆవహించిన కరోనా భయం ఇప్పుడు మనుషుల్లో మూఢనమ్మకాలను కూడా తట్టిలేపుతోంది. ఆధునిక సమాజం ఉండే హైదరాబాద్ లోనూ కరోనా బాబాలు పుట్టిక రావడం గమనార్హం. కరోనాను నిమ్మకాయలు.. తాయత్తులతో తగ్గిస్తానంటూ ఓ కరోనా బాబా హైదరాబాద్ లో జనాలను మోసం చేస్తున్నారు. వాట్సాప్ లో మెసేజ్ ల ద్వారా ఆస్పత్రులకు వెళ్లకుండానే తగ్గిస్తానంటూ ప్రచారం చేస్తున్నాడు. చివరికి అతడి ఆట కట్టైంది.

తనకు దివ్య శక్తులున్నాయని.. కరోనాను నయం చేస్తానంటూ మోసం చేస్తున్న బాబాను మియాపూర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. న్యూ హఫీజ్ పేట్ లోని హనీఫ్ కాలనీకి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్ దర్గాను అడ్డాగా మార్చుకొని సమస్యలతో వచ్చే వారికి మంత్రాలు చేస్తూ తాయెత్తులు కడుతూ ఉండేవాడు. మార్చి నుంచి కరోనా ప్రబలడంతో కొత్త వ్యాపారం మొదలుపెట్టి తన పేరును కరోనాబాబాగా మార్చుకొని మోసాలకు తెరలేపాడు.కరోనాతో భయపడుతున్న ప్రజల అసహాయతను క్యాష్ చేసుకున్నాడు.

నిమ్మకాయలు, తాయెత్తులతో కరోనాను నయం చేస్తానని.. ఇక పై మాస్క్ ధరించాల్సిన అవసరం ఉండదని నమ్మిస్తున్నాడు. ఇస్మాయిల్ తోపాటు తన అనుచరుడైన సలీంబాబాలు కలిసి మెహదీపట్నం, బోరబండ, మియాపూర్ , హఫీజ్ పేట సహా చాలా ప్రాంతాల్లో వేలమందిని ఇలానే మోసం చేశారు.

దర్గాకు తాజాగా 50మంది వరకు రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ బాబా గుట్టు రట్టు అయ్యింది. కరోనా లక్షణాలుంటే ఆస్పత్రులకు రావాలని.. ఇలా బాబాలను నమ్మి మోసపోవద్దంటూ పోలీసులు ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించారు.