Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ చనిపోయారంటూ ఫేక్ న్యూస్

By:  Tupaki Desk   |   28 July 2019 6:15 PM GMT
మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ చనిపోయారంటూ ఫేక్ న్యూస్
X
మాజీ మంత్రి, హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నేత ముఖేశ్ గౌడ్ కన్నుమూసినట్లుగా ఆదివారం రాత్రి వదంతులు వ్యాపించాయి. ఓ టీవీ చానల్ ఈ వార్త ప్రసారం చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ పలువురు ముఖేశ్ గౌడ్ మృతి చెందినట్లుగా పోస్టింగులు పెట్టారు. ప్రముఖ తెలుగు దినపత్రిక కూడా ఒకటి ముఖేశ్ గౌడ్ చనిపోయినట్లుగా రాత్రి 10.20 ప్రాంతంలో తమ వెబ్‌సైట్లో వార్త ప్రచురించింది.. అయితే, కొద్ది సేపటికే దాన్ని తొలగించింది.

కాగా.. ఈ వదంతులను ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఖండించారు. తన తండ్రికి సంబంధించి టీవీల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిన మాట వాస్తవమే అయినప్పటికీ మరణించలేదని.. వైద్యులు ట్రీట్‌మెంట్ చేస్తున్నారని ప్రకటించారు. మరోవైపు ఆయనకు చికిత్స చేస్తున్న అపోలో ఆసుపత్రి కూడా దీనిపై ప్రకటన చేసింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారని.. అప్పటికే ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని.. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నామని.. పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

ముఖేష్ గౌడ్ కొన్ని నెలలుగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖేష్‌గౌడ్‌ ఆరోగ్య పరిస్థితి ఇటీవల పూర్తిగా క్షీణించింది. అతని శరీరం వైద్యానికి సహకరించపోవడంతో వైద్యులు చికిత్స నిలిపివేసినట్లుగా ఇటీవల ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఆసుపత్రి నుంచి 10 రోజుల కిందట ఇంటికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల సమయంలోనూ ఆయన అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నా ఇప్పటి వరకూ ఆయన కోలుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

కాగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ముఖేష్‌ను ఆసుపత్రిలో చేర్చడం.. ఆ వెంటనే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆసుపత్రికి హుటాహుటిన రావడంతో ముఖేశ్ మృతిచెందినట్లుగా వదంతులు ప్రచారమయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు ఆ విషయాన్ని నిర్ధారించుకోకుండా వార్తలను ప్రసారం చేయడంతో మరింత మందికి ఈ తప్పుడు వార్త చేరింది. దీంతో ముఖేశ్ అనుచరులు, అభిమానులు ఆందోళన చెంది ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.