Begin typing your search above and press return to search.

దొంగనోట్ల కేసులో ఎమ్మెల్యే ఫిక్స్?

By:  Tupaki Desk   |   22 Sep 2015 6:10 AM GMT
దొంగనోట్ల కేసులో ఎమ్మెల్యే ఫిక్స్?
X
కోట్లాది రూపాయిలు సంపాదించాలన్న కక్కుర్తి.. ఎన్ని అడ్డదారులు తొక్కిస్తుందనటానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెబుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. తనకున్న పరిచయాలతో వచ్చేనాలుగు కాంట్రాక్టులు చేసుకోవటం మానేసి.. భారీగా సంపాదించాలన్న అతృతలో అడ్డదారి పట్టి.. ఇప్పుడు అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్యే తీరు అధికారపార్టీలోనూ చర్చగా మారింది.

దొంగనోట్ల చలామణిలో కీలకపాత్ర పోషిస్తూ.. వేరే రాష్ట్రాల పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యే భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరి వ్యవహారం ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో తరచూ చర్చకు వస్తోంది. తన అనుచరులతో కర్ణాటక.. ఢిల్లీ.. ఉత్తరప్రదేశ్.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు తన దందాను వ్యాప్తి చేసిన సదరు ఎమ్మెల్యే అనుచరుల్ని ఈ మధ్యనే ఛత్తీస్ గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

అక్కడి పోలీసుల విచారణతో తాము చేస్తున్న దందాతో పాటు.. తమ రింగ్ మాష్టర్ గురించిన వివరాలు కూడా పోలీసులకు చెప్పేసినట్లు చెబుతున్నారు. దీంతో.. ఇప్పటికే ఛత్తీస్ గఢ్.. బెంగళూరు పోలీసులు పిలిపించుకొని మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యే పై కేసు పెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయన్న మాట వినిపిస్తోంది.

ఒకవేళ అదే జరిగితే.. తెలంగాణ అధికారపక్షానికి ఇదో భారీ ఎదురుదెబ్బగా చెబుతున్నారు. సంఘ విద్రోహక శక్తులకు ఆశ్రయం ఇస్తూ.. దుర్మార్గాలకు పాల్పడుతున్నారంటూ విపక్షాలు విరుచుకుపడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి నేతల విషయంలో అన్నీ విషయాలు బయటకు వచ్చే ముందే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందే మేల్కొని.. కొరడా ఝుళిపిస్తే బాగుంటుంది. ఒకవేళ అదే పని చేస్తే.. హద్దులు దాటే వారి విషయంలో తానెంత కఠినంగా ఉంటానన్న విషయం అర్థం కావటంతో పాటు.. అధికారపక్షం నేతలు మరింత జాగ్రత్తగా ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమువుతోంది. మరి.. కేసీఆర్ ఆ పని చేస్తారో లేదో చూడాలి.