Begin typing your search above and press return to search.

నకిలీ మకిలి టీకాలకు పట్టేసింది.. తేడాను ఇలా తేల్చేయొచ్చు

By:  Tupaki Desk   |   6 Sep 2021 3:10 AM GMT
నకిలీ మకిలి టీకాలకు పట్టేసింది.. తేడాను ఇలా తేల్చేయొచ్చు
X
మనిషికి మించిన ప్రమాదకరమైన జంతువు.. ఈ ప్రపంచంలోనే ఉండదేమో. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. అతడిలోని స్వార్థం.. దురాశ.. ప్రతిదాన్లోనూ సొమ్ము చేసుకోవాలనుకునే దుర్మార్గం మనిషిలో తప్పించి మరెవరిలోనూ కనిపించదు. ప్రపంచాన్ని కిందా మీదా పడేస్తున్న కరోనా లాంటి వేళలోనూ.. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న తపనతో చేసే దందా గురించి తెలిస్తే.. ఛీ.. ఛీ అనకుండా ఉండలేం. కరోనా సెకండ్ వేవ్ వేళలో.. అత్యవసర వైద్యానికి అవసరమైన ఇంజక్షన్లను బ్లాక్ లో భారీగా తీసుకురావటం.. పలువురిని పోలీసులు పట్టుకోవటం తెలిసిందే.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్లకు తాజాగా నకిలీ మకిలి పట్టింది. ఈ చీడ కారణంగా.. ఏవి అసలైనవో.. ఏది నకిలీ అన్నదో అర్థం కానిపరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆసియా.. ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇలాంటి డూప్లికేట్ వ్యాక్సిన్లను ఇట్టే కనిపెట్టేందుకు వీలుగా.. మార్గదర్శకాల్ని జారీ చేసింది.

ప్రస్తుతం భారత్ లో ఫూణెకు చెందిన సీరం సంస్థ కోవీ షీల్డ్ తయారు చేస్తుంటే.. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ తయారుచేస్తోంది. ఇక.. హైదరాబాద్ కే చెందిన మరో ఫార్మాదిగ్గజం రెడ్డి ల్యాబ్స్ వారు రష్యా సంస్థ సహకారంతో స్పూత్నిక్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెల్లడైన మార్గదర్శకాల్లో కోవీ షీల్డ్.. కొవాగ్జిన్ రెండింటికి సంబంధించి అసలు ఎలా ఉంటాయి? నకిలీకి వాటికి మధ్య తేడా ఏమిటన్న దానిపై మార్గదర్శకాల్ని విడుదల చేసింది. వీటితో నకిలీలను ఇట్టే గుర్తించే వీలుందని చెబుతున్నారు.

కోవీషీల్డ్

- లేబుల్‌ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. ట్రేడ్‌మార్కుతో సహా కోవిషీల్డ్‌ అన్న పేరు స్పష్టంగా కనిపిస్తుంది.

- జనరిక్‌ పేరు బోల్డ్‌ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది. సీజీఎస్‌ ‘నాట్‌ ఫర్‌ సేల్‌’ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి.

- వయల్‌పై లేబుల్‌ అతికి ఉన్నచోట ఎస్‌ఐఐ (SII) లోగో కనిపిస్తుంది. ఎస్‌ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. అలా ఉంటేనే అసలైనది.

- లేబుల్‌పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన వైట్ ఇంక్ తో ప్రింట్ చేసి ఉంటుంది. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సులభంగా చదవొచ్చు. మొత్తం లేబుల్‌పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే కనిపిస్తుంది.

కొవాగ్జిన్

- లేబుల్‌పై డీఎన్‌ఏ నిర్మాణం లాంటి ఫోటో ఉంటుంది. అది కేవలం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది.

- లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్‌ అని రాసి ఉంటుంది.

- కోవాగ్జిన్‌ అని రాసి ఉన్న హోలోగ్రామ్‌ కూడా అతికించి ఉంటుంది. అది మాత్రమే అసలైనదిగా చెప్పాలి.