Begin typing your search above and press return to search.

భార‌త్ ముద్దు ..అమెరికా వ‌ద్దు

By:  Tupaki Desk   |   27 Feb 2018 6:55 AM GMT
భార‌త్ ముద్దు ..అమెరికా వ‌ద్దు
X
ప్ర‌తీ ఏడు అమెరికాకు వెళ్లే భార‌తీయుల సంఖ్య త‌గ్గుతుంద‌ని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికా పాలసీ(ఎన్‌ ఎఫ్ ఏపీ) తేల్చి చెప్పింది . డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్షుడిగా అధికారం చేప‌ట్టిన‌ప్పటి నుంచి అమెరికాకు వ‌చ్చే విదేశీయుల‌పై ప‌లు ఆంక్ష‌లు విధిస్తున్నారు.దీంతో విదేశీయులు డాల‌ర్ డ్రీమ్ ను వ‌దిలేసి స్వ‌దేశంలో త‌మ ప్ర‌తిభకు సాన‌బెడుతున్నారు.

ఇదంతా ట్రంప్ అమెరికా అధ్య‌క్ష‌ప‌ద‌వి లో పోటీ చేస్తున్న‌ప‌టి నుంచే విదేశీయుల‌పై ఆంక్ష‌లు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. అమెరికా సరుకులనే కొనండి.. అమెరికన్ లనే పనిలో పెట్టుకోండి అంటూ ప్రచారం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు హెచ్1బీ వీసాలకు కళ్లెం వేసిన విష‌యం తెలిసిందే.

ఉన్నతస్థాయి నైపుణ్యాలు కలిగి అధిక వేతనానికి అర్హులైన వారినే దేశంలోకి అనుమతిస్తామని ఆంక్షలు విధించారు. భార‌త్ తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఐటీ ఉద్యోగుల‌కు అత్యంత ప్రీతిపాత్రమైన తాత్కాలిక వీసా నిబంధనలను కఠినతరం చేశారు. అమెరికన్ల ఉద్యోగాలు - వేతనాలు కాపాడాలన్న లక్ష్యంతో విదేశీయులను దేశంలోనికి అనుమతించే విషయంలో రూపొందించిన అన్ని చట్టాలను కఠినంగా అమలు చేయాలని ట్రంప్ ప్ర‌భుత్వం చెప్పింది. అప్ప‌టి నుంచి అమెరికా వెళ్లాల‌నుకునే వారు చాలా ఇబ్బందులు ప‌డేవారు. వీసా కోసం ప్ర‌య‌త్నాలు చేసి చివ‌రికి అమెరికా వెళ్లేందుకు విముఖ‌త వ్య‌క్తం చేసేవారే ఎక్కువ మంది ఉన్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో అమెరికా వెళ్లే ఇంజినీరింగ్ విద్యార్ధుల సంఖ్య 20శాతం త‌గ్గింద‌ని నేష‌నల్ ఫౌండేష‌న్ ఫ‌ర్ అమెరికా పాల‌సీ తేల్చిచెప్పింది. 2016-17మ‌ధ్య కాలంలో అధ్య‌యనం చేసిన ఆ సంస్థ కంప్యూటర్‌ సైన్స్‌ - ఇంజనీరింగ్ కోర్సులు చదవడానికి అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు తెలిపింది.

భార‌త్ నుంచి అమెరికా వెళ్లే వారిలో ఎక్కువ శాతం విద్యార్ధులు - ఉద్యోగులే ఉంటారు. విద్యార్ధులు భారత్ నుంచి వచ్చి కంప్యూటర్‌ సైన్స్ - ఇంజనీరింగ్ కోర్సు చేసేందుకు మొగ్గుచూపుతుంటారు. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో అమెరికా విధిస్తున్న వీసా ఆంక్ష‌లు - చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని ఎన్‌ ఎఫ్‌ ఏపీ పేర్కొంది.