Begin typing your search above and press return to search.

ఈ ఎన్నిక‌ల్లో...ఈ మోతుబ‌రులెవ‌రూ క‌నిపించ‌లేదే!

By:  Tupaki Desk   |   16 May 2019 4:05 PM GMT
ఈ ఎన్నిక‌ల్లో...ఈ మోతుబ‌రులెవ‌రూ క‌నిపించ‌లేదే!
X
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ప‌లువురు కొత్త నేత‌ల‌కు ఎంట్రీ ఇస్తే.. కొంద‌రు పాత కాపుల‌కు శుభం కార్డు వేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీలో ప్ర‌త్యేకించి రాయల‌సీమ జిల్లాల నుంచి చాలా మంది వార‌సులు ఈ ఎన్నిక‌ల ద్వారానే పొలిటిక‌ల్ గా తెరంగేట్రం చేశారు. అదే స‌మయంలో సీమ‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు ప్ర‌తిష్ఠ‌లు సంపాదించుకున్న ప‌లువురు నేత‌ల అడ్రెస్ ల‌ను కూడా ఈ ఎన్నిక‌లు గ‌ల్లంతు చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ త‌ర‌హా ప‌రిణామాలు... రాయ‌సీమ ముఖ‌ద్వారంగా ప్ర‌సిద్ధికెక్కిన క‌ర్నూలు జిల్లాలోనే చోటుచేసుకోవడం గ‌మ‌నార్హం.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది ఏరాసు ప్ర‌తాప్ రెడ్డి గురించి. దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీనే త‌న తెలివితేట‌ల‌తో మెప్పించిన సీనియ‌ర్ మోస్ట్ నేత ఏరాసు అయ్య‌పురెడ్డి కుమారుడిగా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌తాప్ రెడ్డి... వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి హ‌యాంలో ఏకంగా న్యాయ శాఖ మంత్రిగా కొన‌సాగారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న‌తో టీడీపీలో చేరిన ఈయ‌న త‌న‌కు తాను న‌ష్టం చేసుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. అప్ప‌టిదాకా జ‌న‌ర‌ల్ గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ముక్క‌లు చెక్క‌లు కావ‌డం, త‌న సొంత మండలం ఇంకో నియోజ‌క‌వ‌ర్గంలో చేర‌డంతో విధి లేని ప‌రిస్థితుల్లో పాణ్యం నుంచి 2014లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఈ ద‌ఫా కూడా పాణ్యం నుంచే బ‌రిలోకి దిగి ఈ సారి అయినా విజ‌యం సాధించాల‌ని చూసినా ఆయ‌న య‌త్నాలు ఫ‌లించ‌లేదు. గ‌త ఎన్నికల్లో ఆయ‌న‌ను ఓడించిన గౌరు చ‌రితారెడ్డి టీడీపీలో చేర‌డంతో ఏరాసు ఇంటిలోనూ కూర్చోక త‌ప్ప‌లేదు. ఇక ఏరాసు రాజ‌కీయాల నుంచి దాదాపుగా క‌నుమ‌రుగు అయిన‌ట్టేన‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

ఏరాసు త‌ర్వాత బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు చెప్పుకోవాలి. టీడీపీతో రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లెట్టిన బైరెడ్డి... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అదే పార్టీకి పోటిగా రాజ‌కీయాలు చేశారు. 2014లో ఓట‌మి చ‌విచూసి - 2019లో స‌త్తా చాటాల‌ని ప‌క్కా ప్లానే వేశారు. అప్ప‌టిదాకా త‌న చేతిలోనే కొన‌సాగుతున్న రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితిని గంగ‌లో క‌లిపేసి కాంగ్రెస్‌ లో చేరారు. కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్గి వెంట న‌డిచారు. అయితే చివ‌రి నిమిషంలో కోట్ల టీడీపీలో చేర‌డంతో బైరెడ్డి ఎటూ కాకుండా పోయారు.

ఇక క‌ర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న బుట్టా రేణుక ప‌రిస్థితి అయితే మ‌రింత ఆస‌క్తిక‌రం. 2014 ఎన్నిక‌ల దాకా ఏ ఒక్క‌రికీ తెలియ‌ని ఆమె... జ‌గ‌న్ ఆద‌ర‌ణతో ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చారు. క‌ర్నూలు ఎంపీగా గెలిచిన ఆమె... ఆ త‌ర్వాత వైసీపీకి హ్యాండిచ్చేసి టీడీపీలో చేరారు. ఈ క్ర‌మంలో 2019లోనూ కర్నూలు ఎంపీ టికెట్ బుట్టాకేన‌ని నారా లోకేశ్ ప్ర‌క‌టించినా... చివ‌రి నిమిషంలో కోట్ల చేరిక‌తో బుట్టా తిరిగి త‌న సొంత గూటికి చేరిపోయారు. అయితే అప్ప‌టికే ఆ టికెట్ ను జ‌గ‌న్‌... మరో బీసీ నేత‌కు ఇవ్వ‌డంతో బుట్టా క‌నీసం ప్ర‌చారంలో కూడా క‌నిపించ‌కుండా పోయారు.

ఎస్వీ మోహ‌న్ రెడ్డిదీ అదే ప‌రిస్థితి. టీడీపీ సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మోహన్ రెడ్డి గ‌డ‌చిన ఎన్నికల్లో క‌ర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. అయితే త‌న బావ భూమా నాగిరెడ్డి - మేన‌కోడ‌లు అఖిల‌ప్రియ‌లు టీడీపీలో చేర‌డంతో ఎస్వీ కూడా వారి బాట‌లోనే న‌డిచారు. క‌ర్నూలు టికెట్ పై ఎస్వీ ఆశ‌లు పెట్టుకోగా... మాజీ మంత్రి టీజీ వెంక‌టేశ్... త‌న కుమారుడి కోసం అంటూ ఆ టికెట్ ను త‌న్నుకుపోయారు. ఫ‌లితంగా తిరిగి వైసీపీలోకి వ‌చ్చినా ఎస్వీ ఈ ఎన్నిక‌ల్లో ఎక్క‌డా క‌నిపించ‌కుండాపోయారు. ఇక వీరు మున్ముందు కూడా పెద్ద‌గా క‌నిపించే ఛాన్సు లేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.