Begin typing your search above and press return to search.

ప్రముఖులే కానీ.. ఆ విషయంలో వణుకే

By:  Tupaki Desk   |   23 Dec 2015 9:32 AM GMT
ప్రముఖులే కానీ.. ఆ విషయంలో వణుకే
X
ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి.. వారి స్థాయికి తగ్గట్లే సమస్యలు ఉంటాయా? అంటే అవుననే చెబుతున్నారు. కొన్ని విషయాల్లో వారెంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని.. ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుందని చెబుతుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మూడు.. నాలుగు రోజుల క్రితం నిండు అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ‘‘కామ చంద్రబాబు’’.. ‘‘సెక్స్ ముఖ్యమంత్రి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే అంతలేసి మాటలు అనటం ఏమిటి? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

ఇక.. చంద్రబాబు వ్యక్తిత్వం.. ఆయన వ్యక్తిగతంగా మహిళల విషయలో ఎలా వ్యవహరిస్తారన్న అంశంపై చర్చ మొదలైంది. రోజా మొదలు.. తాజాగా జగన్ సైతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కామ చంద్రబాబుగా అందరూ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఒక అధినేతపై ఈ తరహా ఆరోపణలు చాలానే ఇబ్బంది పెట్టేవని చెప్పక తప్పదు.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన చంద్రబాబు.. ఇప్పుడు.. ఈ పరిస్థితుల్లో తన పేరు ముందు ‘‘కామ’’.. ‘‘సెక్స్’’ అన్న ట్యాగ్ లు తగిలించుకోవటం చాలా ఇబ్బంది కలిగించే వ్యవహరంగా చెప్పాలి. ఈ సందర్భంగా మహిళలతో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారన్న ఆసక్తికర చర్చ మీడియా.. రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఈ అంశంపై చంద్రబాబుకు బాగా తెలిసిన.. ఆయన్ను చాలా దగ్గర నుంచి చూసిన ఒక సీనియర్ జర్నలిస్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. మహిళల పట్ల చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు.

బాబు కాస్త బిడియంగా ఉంటారని.. మహిళల విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తారన్నారు. నిజానికి బాబుతో సహా చాలామంది రాజకీయ నేతలు.. ప్రముఖులు మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పారు. ఏ చిన్న పొరపాటు దొర్లినా ఎదురయ్యే ఇబ్బందులు ఎంత తీవ్రంగా ఉంటాయన్న విషయం ఉన్నత స్థానంలో ఉన్న వారికి తెలియంది కాదు. ఎవరు.. ఎప్పుడు ఎలా..? దాడి చేస్తారోనన్న విషయంపై అనుక్షణంగా అలెర్ట్ గా ఉంటారన్నారు. తమపై బురద జల్లేందుకు రాజకీయ ప్రత్యర్థులు కాచుకున్న వేళ.. మహిళలతో విడిగా మాట్లాడేందుకు కూడా రాజకీయ నేతలు సంశయిస్తారని చెబుతారు.

చంద్రబాబు మీద రోజా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. అవి తెంపరితనంతో చేసిన వ్యాఖ్యలు అనే కన్నా.. బరితెగింపు మాటలనటం సమంజసమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎందుకంటే.. తనను కలవటానికి వచ్చే మహిళా నేతల విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తారని.. ఒంటరిగా వచ్చిన మహిళా నేతలతో సమావేశం కావటానికి కూడా బాబు సంశయిస్తారన్న సంగతి ఆయన గురించి బాగా ఎరిగిన వారికి తెలిసిందే. దీనికి ఉదాహరణగా ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తారు. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సందర్భంలోచంద్రబాబును కలవటానికి ఒక సినీ నటి వచ్చారు. ఈ సందర్భంగా సదరు నటి తనతో భేటీ అయి.. తిరిగి వెళ్లే వరకూ తనతోనే ఉండాల్సిందిగా ఒక నేతను చంద్రబాబు కోరారట. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు.. తాము ఇరుకున పడే అంశాలకు వీలైనంత దూరంగా ఉండటమే కాదు.. ఆచితూచి వ్యవహరిస్తారు.

చంద్రబాబు ఒక్కరే కాదు.. ఇలాంటి పరిస్థితి అందరిదీ. ఈ మధ్యనే ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ చెప్పిన విషయాల్ని ప్రస్తావించాల్సిందే. తనకు స్వర్గం చూపించేందుకు.. ఒక బాలీవుడ్ నటి విపరీతంగా ప్రయత్నించిందని.. ఆమె నుంచి తప్పించుకోవటానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పిన ఆయన.. తనను కోరుకునే మహిళలు చాలామందే ఉన్నారనటం ఇక్కడ ప్రస్తావించాలి. అయితే.. తాను అలాంటి వాటికి దూరంగా ఉంటానని రాందేవ్ స్పష్టం చేశారు.

రాజకీయ నాయకులే కాదు.. ఉన్నతాధికారులకు కూడా ఇలాంటి ఇబ్బందే ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ ఇక్కడ ప్రస్తావించాలి. వైఎస్ మరణం తర్వాత.. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని విజయవాడ పోలీస్ కమిషనర్ గా నియమించారు. నిజాయితీకి నిలువెత్తు రూపంగా ఆయన్ను చెబుతారు. ఆయన ఎంతటి నిజాయితీ పరుడంటే.. వృత్తిపరంగా తనకు పరిచయమైన వ్యక్తుల వచ్చి స్వీటు బాక్స్ లు ఇస్తే తీసుకోవటానికి కూడా ఇష్టపడరు. అలాంటి ఆయన విజయవాడ కమిషనర్ గా కావటానికి ముందు.. విజయవాడ కమిషనర్ గా మరో సీనియర్ ఐపీఎస్ అధికారికి పని చేశారు. ఆయనకు మహిళలతో సంబంధాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

అలాంటి చోట తనలాంటి వారికి పోస్టింగ్ రావటంపై ఆయన చాలానే మదన పడ్డారు. తనను ఇరుకున పెట్టటానికి ఉండే అవకాశాలన్నింటిని గుర్తించారు.

కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. కమిషనరేట్ లో పని చేసే మహిళా ఉద్యోగుల్ని వేరే చోటకు బదిలీ చేసేశారు. బదిలీకి సాధ్యం కాని కొంతమంది మహిళా అధికారులు సాయంత్రం 5 గంటల తర్వాత ఆఫీసుల్లో ఉండరాదని మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ అలా ఉంటే వారిపై సీరియస్ అయ్యేవారు. పని ఉంటే వేరే వారికి బదలాయించాలని చెప్పేవారు.

ఇదొక్కటే కాదు.. తమ బాధలు చెప్పుకోవటానికి ఎవరైనా మహిళలు వస్తే.. ఇద్దరు గన్ మెన్లను.. వీలైతే మరో సహాయకుడ్ని కూడా తన వద్దే ఉంచేవారు. బాధిత మహిళలు ఫిర్యాదులు చేసే సమయంలో కార్యాలయ తలుపులు తెరిచే ఉంచాలని ఆదేశించేవారు. ఎందుకిలా అంటే.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే.. లేనిపోని వివాదాల్లో చిక్కుకోవటం ఖాయమని సన్నిహితులతో చెప్పుకునేవారు. ఇంత పెద్ద అధికారి అయిన మీకూ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయా? అన్న ప్రశ్నకు ఆయన చిరునవ్వుతో బదులిస్తే.. వివాదానికి అవకాశం ఇచ్చే కన్నా.. దాన్ని దగ్గరకు కూడా రానియ్యకుండా చూసుకోవటం చాలా అవసరమని.. లేదంటే భారీ డ్యామేజ్ జరుగుతుందనేవారు. ఇలాంటి ఉదంతాలు చూసినప్పుడు కీలకస్థానాల్లో ఉండేవారు ఎంత బాధ్యతగా ఉంటారో తెలుస్తుంది. అందుకు భిన్నంగా సంచలనం కోసం రోజాలాంటి వారు చేసే వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.