Begin typing your search above and press return to search.

వామ్మో.. ఇదెక్కడి అభిమానం.. జగన్ ఫోటోకు దండేయటం

By:  Tupaki Desk   |   12 Jan 2022 11:00 AM IST
వామ్మో.. ఇదెక్కడి అభిమానం.. జగన్ ఫోటోకు దండేయటం
X
అభిమానం తప్పేం కాదు. కానీ.. ఆ పేరుతో వెనుకా ముందు చూసుకోకుండా.. విచక్షణ మరిచి చేసే చేష్టలు ఇబ్బందికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి సీనే క్రిష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. దూకుడు రాజకీయాలు పెరిగిపోయిన తర్వాత.. దేనిలోఅయినా అతిని ప్రదర్శించటం ఎక్కువైంది. ఇలాంటి అతిని ప్రోత్సహిస్తున్న తీరుతో.. ఇది కాస్తా వెర్రి తలలు వేస్తోంది. తాజా ఉదంతం దీనికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలి.

తాము అభిమానించే అధినేతలు.. నేతల మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శించటం కోసం పాలాభిషేకం లాంటివి చేయటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసిన కొందరు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద తమకున్న అభిమానాన్ని కాస్తంత భిన్నంగా ప్రదర్శించారు. దీనికి క్రిష్ణా జిల్లా నూజివీడు మునిపల్ ఆఫీసులోని కొందరు సిబ్బంది ముఖ్యమంత్రి మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శించాలనుకున్నారు.

అంతే.. ఆఫీసు ఆవరణలో కుర్చీ హ్యాండిల్స్ మీద ప్లాంక్ పెట్టి.. దాని మీద జగన్ ఫోటోను ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగక.. తమకున్న అభిమానం ఎంతన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ ఫోటోకు దండ వేసి.. పూలు జల్లిన వైనం చూసినోళ్లు ముక్కున వేలేసుకున్నారు.

మన సంప్రదాయంలో ఫోటోలకు దండలు ఎప్పుడు వేస్తారో తెలియంది కాదు. తల నిండా జగన్ మీద అభిమానంతో ఉన్న వారు.. వెనుకా ముందు లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు. చక్కగా జీవించి ఉన్న ముఖ్యమంత్రి ఫోటోకు ఇలా దండలు వేయటం ఏమాత్రం సబబా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ తరహా చేష్టల్ని ఎవరో ఒకరు అడ్డుకోవాలి కదా? అందుకు భిన్నంగా తానా అంటే తందానా అన్నట్లుగా వ్యవహరిస్తే.. తాము అభిమానించే వారిని ఇబ్బందిపెట్టేదిగా ఉంటుందన్న విషయాన్ని ఈ అభిమానులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో? ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానంతో చేసిన ఈ పనిని జగన్ అభిమానులుసైతం జీర్ణించుకోలేకపోతున్నారు.