Begin typing your search above and press return to search.

బాలయ్య వస్తే బాబుకు లాభమా.? నష్టమా?

By:  Tupaki Desk   |   13 July 2019 6:16 AM GMT
బాలయ్య వస్తే బాబుకు లాభమా.? నష్టమా?
X
2019 అసెంబ్లీ ఎన్నికలు టీడీపీకి పీడకలను మిగిల్చాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎదుర్కోని దారుణ ఓటమిని తెలుగుదేశం పార్టీ చవిచూసింది. ఈ ఓటమిని జీర్ణించుకునే పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ లేదు. చంద్రబాబు ఒక్కడే కాస్త కోలుకొని పోరాడుతున్నా.. అసెంబ్లీలో ఇంటా బయటా బాబుకు తోడుగా రాజకీయం చేసే నాయకుడే లేకుండా పోయాడని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు..

ఇప్పుడు నందమూరి తారక రామరావు స్థాపించిన పార్టీ దుస్థితిని వీడాలంటే చంద్రబాబుకు తోడుగా ఆయన కుమారుడు నందమూరి బాలక్రిష్ణ టీడీపీలో యాక్టివ్ కావాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.

కానీ బాలయ్య ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. అటు సినిమాలు చేస్తూనే ఇటు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు. బాలయ్య ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మాస్ దర్శకుడు

బోయపాటి శీనుతో ఓ చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడు. అనంతరం వివి వినాయక్ కాంబినేషన్ ఓ చిత్రం చేయబోతున్నాడని వార్తలొచ్చాయి. ఇక యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ నచ్చిందని ఆయనతోనూ భవిష్యత్ లో చిత్రం చేస్తాడని అంటున్నారు. ఈ ఐదేళ్లు బాలయ్య బిజీగా ఉన్నట్టే లెక్క.

ఈ నేపథ్యంలో కుదేలైన టీడీపీని గట్టెక్కించాలని బాలయ్య బాధ్యతలు చేపట్టాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. చంద్రబాబుకు తోడుగా టీడీపీని నడిపించాలని.. రాయలసీమలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీని నిలబెట్టాలని ఇంత వ్యతిరేకతలోనూ హిందూపురంలో గెలిచిన బాలయ్యను రాయలసీమ టీడీపీ ఇన్ చార్జిని చేయాలని కోరుతున్నారు. అంతేకాదు.. టీడీపీ పరిస్థితి చూసి పూర్తి స్థాయిలో సినిమాలు వదిలి రావాలని బాలయ్యను కోరుతున్నారు. మరి బాలయ్య టీడీపీ కోసం వస్తే టీడీపీలో తట్టుకుంటుందా లేదా అన్నదే ప్రశ్న..

మొన్నటి ఎన్నికల వేళ బాలయ్య మాటలు, చేష్టలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. హిందూపురంలో అభిమానులను కొట్టడం.. పరుష పదజాలంతో తిట్టడం.. సినిమాల్లో లాగానే బయట దూకుడుగా వ్యవహరించడం దుమారం రేపింది. టీడీపీపై, బాలయ్య తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. బాలయ్య మాట తీరు, చేష్టలు, వ్యవహారశైలిపై ఎన్నో కంప్లైట్లు ఉన్నాయి. మరి బాలయ్య కనుక అభిమానులు కోరినట్టు పుల్ టైం వస్తే చంద్రబాబుకు తోడుగా ఉంటే మరెన్ని వివాదాలు వస్తాయనే టెన్షన్ కూడా టీడీపీ అధిష్టానంలో ఉంది. దూకుడైన బాలయ్యను తట్టుకోవడం కష్టమనే భావన ఉంది. మరి బాలయ్య విషయంలో బావ చంద్రబాబు ఎలాంటి నిర్నయం తీసుకుంటాడనేది వేచిచూడాలి.