Begin typing your search above and press return to search.

​చడీచప్పుడు కాకుండా టీ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి?

By:  Tupaki Desk   |   4 Oct 2016 5:05 AM GMT
​చడీచప్పుడు కాకుండా టీ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి?
X
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పంచాయితీ వార్డు పదవికి ఎన్నికలు జరుగుతున్నా.. జరిగే హడావుడి ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఎమ్మెల్సీ ఎన్నిక అంటే ఇంకెంత హడావుడి ఉంటుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. ఇంకా చెప్పాలంటే చడీచప్పుడు కాకుండా తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి అయ్యింది. అది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖాళీ చేసిన ఎమ్మెల్సీ సీటు.

తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న పార్టీ బలాల్ని పరిగణలోకి తీసుకుంటే.. తెలంగాణ అధికార పక్షం టీఆర్ ఎస్ కు తిరుగులేని మెజారిటీ. ఈ నేపథ్యంలో మరే ఇతర పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించలేదు. ఇక.. సోమవారం నామినేషన్ల గడువు తీరే సమయానికి పరీదుద్దీన్ మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో.. ఆయన నామినేషన్ ను పరిగణలోకి తీసుకొని ఆయన ఎన్నికను ఏకగ్రీవం చేసినట్లైంది. అయితే.. ఇందుకు సంబంధించిన అధికారిక నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి పరీదుద్దీన్ మినహా మరెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో.. ఆయన ఎన్నిక అయినట్లు ప్రకటించటం కేవలం సాంకేతికం మాత్రమే. నామినేషన్ల దాఖలు.. పరిశీలన.. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాతే తుది ఫలితాన్ని వెల్లడించాల్సి ఉంది. అందుకు తగ్గట్లే.. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు పరీదుద్దీన్ అభ్యర్థిత్వంపై తెలంగాణ అధికారపక్షం తనదైన రీతిలో రియాక్ట్ అయ్యింది. తమ పార్టీ మైనార్టీలకు సముచిత గౌరవం ఇచ్చిందని గొప్పలు చెప్పే ప్రయత్నం చేసుకున్నారు టీఆర్ ఎస్ నేతలు. మైనార్టీలకు సముచిత గౌరవం ఇచ్చే తెలంగాణ అధికారపక్షం.. మంత్రివర్గంలో ఒక్క మహిళకు ఎందుకు అవకాశం ఇవ్వనట్లు..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/