Begin typing your search above and press return to search.

సిబిల్ స్కోర్ ఉంటేనే రైతులకు రుణాలు!

By:  Tupaki Desk   |   1 Oct 2019 6:27 AM GMT
సిబిల్ స్కోర్ ఉంటేనే రైతులకు రుణాలు!
X
దేశంలో అనిశ్చితితో కూడిన జీవనాధారం ఏదైనా ఉందంటే అది వ్యవసాయమే. విత్తు నాటిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకూ ఎప్పుడేమవుతుందో చెప్పలేని పరిస్థితి. అంతా బాగుండి.. పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత కూడా.. పెట్టిన పెట్టుబడి పైసల రూపంలో మళ్లీ తిరిగి వస్తుందా? లేదా? అన్నది సందేహమే. అలాంటి పరిస్థితుల్లో రైతు తీసుకున్న రుణాల్ని పక్కాగా.. చెప్పిన సమయానికి తీర్చేసే పరిస్థితి ఉందా? అంటే అనుమానమే.

మోతుబరి రైతుల విషయంలో ఓకే కానీ.. బక్కచిక్కిన రైతు విషయంలోనే సమస్యలెన్నో. అలాంటి రైతుకు ఇచ్చే రుణాలకు సిబిల్ స్కోరింగ్ తో లింకు పెట్టే తీరు విన్నంతనే విస్మయానికి గురి చేసేలా ఉంటుందని చెప్పాలి. తాజాగా ఏపీలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో రైతులకు ఇచ్చే రుణాలకు సిబిల్ స్కోరే లెక్క అంటూ చెప్పిన మాట ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. కొత్త చర్చకుతెర తీస్తుందని చెప్పాలి.

విపత్తులు.. రుణాల రీషెడ్యూల్ లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకొని స్థానిక బ్యాంకు మేనేజర్లు నిర్ణయం తీసుకుంటారని.. రైతులకూ సిబిల్ స్కోర్ ను ప్రామాణికం చేసి.. వారి ట్రాక్ రికార్డు ఆధారంగానే అప్పులు ఇవ్వాలని బ్యాంకులు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

అదే జరిగితే.. పెద్దగా చదువులు లేని నిరుపేద రైతులకు కొత్త తిప్పలు మొదలైనట్లే. బడా కంపెనీలకు ఇచ్చే రుణాల విషయంలోనూ.. ఎన్ పీఏల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాల్సిన బ్యాంకులు అక్కడ ఒకరకంగా.. బక్కచిక్కిన రైతుల విషయంలో మరోలా వ్యవహరిస్తున్న బ్యాంకుల తీరుపై ప్రజాగ్రహం తప్పదు. రైతులకు సిబిల్ స్కోర్ ఆధారంగానే రుణాలు ఇస్తామన్న రూల్ ఏ మాత్రం సమంజసం కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. మరీ.. విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.