Begin typing your search above and press return to search.

మోడీజీ.. ఈ రైతుకు సమాధానం చెప్పు..

By:  Tupaki Desk   |   3 Dec 2018 5:25 AM GMT
మోడీజీ.. ఈ రైతుకు సమాధానం చెప్పు..
X
ఊదరగొట్టే ప్రసంగాలు.. ఏదో చేస్తామని లెక్కలేనని హామీలు .. కానీ మోడీ చరిష్మా 2014లో పనిచేసినట్టు ఇప్పుడు చేయడం లేదు.. బీజేపీ అనుకూల మీడియా ఎంత తొక్కేయాలని చూసినా ఒక వార్త మాత్రం ఇప్పుడు బీజేపీ పరువు తీస్తోంది. మోడీని నిలదీస్తోంది. కడుపుమండిన బీజేపీ పాలిత మహారాష్ట్ర రైతు ఆవేదన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

దేశంలో మద్దతు ధర అందని రైతుల ఆవేదనకు ఈ ఘటన కళ్లకు కడుతోంది. ఆరుగాలం నాలుగు నెలలు కష్టించి పనిచేసిన మహారాష్ట్రలోని నిఫాడ్ కు చెందిన ఆదర్శ ఉల్లి రైతు సంజయ్ సాఠే తన 750 కిలోల ఉల్లిని మహారాష్ట్రలోని నిఫాడ్ మార్కెట్ లో అమ్మాడు. వర్తకులు కేజీకి రూపాయి మాత్రమే లెక్కగట్టారు. చివరకు బేరమాడి రూ.1.40కి కిలోకు అమ్మాడు. 750 కిలోలకు రైతుకు వచ్చింది కేవలం రూ.1064 మాత్రమే. అదే బయట వినియోగదారుల కోసం కిలో ఉల్లి 20 రూపాయలకు పైగా పలుకుతోంది.

పండించిన రైతు నోట్లో మట్టి కొట్టి దళారుల కడుపులు నింపుతున్న మార్కెట్ వ్యవస్థపై ఆ రైతు భగ్గుమన్నాడు. నిరసన తెలుపుతూ ప్రధానమంత్రికి ఆ డబ్బును మనియార్డర్ చేశారు. దేశంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్న అన్నదాతల కష్టానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ ఘటన అందరినీ బాధకు గురిచేస్తోంది. ప్రభుత్వాలు రైతుల విషయంలో అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతోంది.

సంజయ్ సాఠే సాధారణ రైతేం కాదు.. మహారాష్ట్రలో అభ్యుదయ రైతు. 2010లో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనలో ఆయనతో ముచ్చటించేందుకు భారత ప్రభుత్వం ఎంపిక చేసిన రైతుల్లో సంజయ్ ఒకరు. అలాంటి ఆయనే ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మోడీకి షాక్ ఇవ్వడం ఇప్పుడు బీజేపీ పరువు తీస్తోంది.