Begin typing your search above and press return to search.

సివిల్స్ : ఆ రైతు ఇంట ఆనందాలే ఆనందాలు!

By:  Tupaki Desk   |   31 May 2022 7:30 AM GMT
సివిల్స్ : ఆ రైతు ఇంట ఆనందాలే ఆనందాలు!
X
2017 నుంచి ఆకునూరి న‌రేశ్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించి ఎట్ట‌కేల‌కు ఆయ‌న్ను సివిల్స్ వాకిట విజేత‌ను చేశాయి. పేద‌రికాన్ని స‌వాలు చేస్తూ సాగించిన ప్ర‌యాణంలో న‌రేశ్ అనే తెలంగాణ కుర్రాడు ఈ ఉద‌యం మీ అంద‌రికీ స్ఫూర్తి రేఖ అవుతాడు. సామాన్య రైతు కుటుంబం సాధించిన విజ‌యం ద‌గ్గ‌ర నాయ‌కులే కాదు సామాన్యులు కూడా ఆగి ఆలోచించాల్సిందే !

బాగా క‌ష్ట‌ప‌డి చదివించండి మీ బిడ్డ‌లు ఈ లోకాన్ని శాసిస్తారు.. అని అంటారే సాధ్య‌మా ! తెలంగాణ వాకిట భూపాల ప‌ల్లి కి చెందిన కుర్రాడు సాధ్య‌మే అని నిరూపించాడు. గొప్ప విజ‌యాల నిరంత‌ర సాధ‌న‌తోనే సాధ్యం అని నిరూపించాడు.

త‌ల్లి ఓ ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులురాలు. తండ్రి ఓ స‌న్న‌కారు రైతు. అయితేనేం ఆ కుర్రాడి ప‌ట్టుద‌ల ద‌గ్గ‌ర అవ‌న్నీ ప‌ట్టింపుల్లో లేని విష‌యాలు. కాశింప‌ల్లికి చెందిన ఆకునూరి న‌రేశ్ జీవితం ఇప్పుడు అంద‌రికీ ఆద‌ర్శం.

ప‌ల్లె బాట‌ల్లో ముళ్ల దారులు దాటుకుని వ‌చ్చే బిడ్డ‌ల‌కు ఆద‌ర్శం. తెలంగాణ వాకిట సేద్యం అనుకూలించ‌క ఆత్మ హ‌త్య‌లే శ‌ర‌ణ్యం అనుకునే రైతుల‌కు, వారి బిడ్డ‌ల‌కూ ఆద‌ర్శం. తెలుగు నేల‌కే ఆయ‌న జీవితం ఆద‌ర్శం అని రాయాలి. రోడ్లు ఊడ్చుతూ అమ్మ, పొలం ప‌నిలో నాన్న... ఆ ఇద్ద‌రి క‌ష్టం ద‌గ్గ‌ర తాను స్థాణువు అయిపోయాడు.

ఇదే నేప‌థ్యం..

స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనే ప్రాథ‌మిక విద్య, అటుపై న‌ర్సంప‌ల్లి ప్ర‌భుత్వ‌రెసిడెన్షియల్ స్కూల్లో ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దివారు. హైద్రాబాద్ చిల‌కూరు ప్ర‌భుత్వ రెసిడెన్షియ‌ల్ స్కూల్లోనే ఇంట‌ర్ చ‌దివి, ఐఐటీలో 210వ ర్యాంకు సాధించారు. గ్రాడ్యుయేష‌న్ మ‌ద్రాస్ ఐఐటీలో పూర్తి చేశారు. త‌రువాత అక్క‌డే ఓ ప్ర‌యివేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ 2017లో సివిల్స్ తొలి ప్ర‌య‌త్నం చేశారు.

అటుపై సెకండ్ అట్మెప్ట్ లో ఆశించిన ఫ‌లితాలు రాలేదు. 2019లో మూడో ప్ర‌య‌త్నంలో భాగంగా ఐఆర్పీఎస్-కు ఎంపిక‌య్యారు. ప్ర‌స్తుతం శిక్ష‌ణ‌లో ఉంటుండ‌గానే మ‌ళ్లీ మ‌రోసారి త‌న అదృష్టం ప‌రీక్షించుకుని సివిల్స్ రాసి 117 వ ర్యాంకు సాధించారు.