Begin typing your search above and press return to search.

జియో టవర్ల విధ్వంసం.. రైతు ఉద్యమానికి సమాధి?

By:  Tupaki Desk   |   28 Dec 2020 3:30 PM GMT
జియో టవర్ల విధ్వంసం.. రైతు ఉద్యమానికి సమాధి?
X
తాము కూర్చున్న కొమ్ముల్ని నరుక్కునేంత మూర్ఖులు కారు పంజాబ్ రైతులు. దేశంలో ఇప్పటివరకు సాగిన ఉద్యమాలకు.. నిరసనలకు కొత్త రూపం ఇచ్చేలా.. ఆధునిక భారతానికి సరికొత్త స్ఫూర్తిగా మారిన రైతుల ఉద్యమంలో విధ్వంసకాండకు అవకాశం లేదు. ఆ మాటకు వస్తే.. పంజాబ్ రైతులు తెలివితక్కువవారు కాదు. ఇంతకాలం శాంతంగా.. వినూత్న నిరసనలతో అందరి నోట శభాష్ అన్న ప్రశంసనల్ని పొందుతునన ఉద్యమంలోకి జియో సెల్ టవర్ల విద్వంసం కచ్ఛితంగా విద్రోహుల పనే అని చెప్పాలి.

రైతు ఉద్యమాన్ని సమాది చేసేందుకే సెల్ టవర్ల విధ్వంసం దిశగా కొన్ని శక్తులు బరితెగిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. మిగిలిన అంశాలన్ని వదిలేసినా.. ఈ రోజున రైతు ఉద్యమం దేశ వ్యాప్తంగా అందరి సానుభూతి పొందిందంటే కారణం.. టెలీ కమ్యునికేషన్ల వ్యవస్థ కారణంగానే. తాము చేస్తున్న నిరసన.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో కలిగే నష్టం.. రైతుకు వచ్చే కొత్త కష్టం గురించి వారు సోషల్ మీడియాలోనూ..వాట్సాప్ లతోనూ షేర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీడియోలు..ఫోటోలు షేర్ అవుతున్నాయంటే.. కమ్యునికేషన్లతోనే.

తమ ఉద్యమానికి అండగా మారిన కమ్యునికేషన్ల వ్యవస్థను ధ్వంసం చేసుకుంటే.. తొలుత నష్టపోయేది రైతులే. ఈ విషయాన్ని రైతు సంఘాల నేతలు ఆలోచించకుండా ఉంటారా? ఇదంతా ఒక ఎత్తు అయితే.. రైతు ఉద్యమాన్ని టచ్ చేయలేని పరిస్థితుల్లో కేంద్రం ఉంది. ఉద్యమానికి పంజాబ్ రాష్ట్ర సర్కారు అండదండలు ఉండటం.. ఎవరూ తప్పు పట్టలేనట్లుగా సాగుతున్న ఉద్యమాన్ని బలహీన పర్చేందుకు.. ఆరాచక శక్తుల్ని అదుపు చేయాలన్న పేరుతో.. ఉద్యమాన్ని బలవంతంగా తొక్కేసే అవకాశాన్ని ఇవ్వని పంజాబ్ రైతులు.. ఇప్పుడు జియో టవర్ల విధ్వంసానికి ఎందుకు పాల్పడతారు? అన్నది ప్రశ్న.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తే.. రైతుల్ని బద్నాం చేయటానికి.. వారు చేస్తున్న ఉద్యమాన్ని నీరుకార్చటానికి వీలుగా.. సెల్ టవర్ల విధ్వంసానికి తెర తీసినట్లుగా అనుమానించక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము శాంతియుతంగానే నిరసన చేస్తున్నామని.. సెల్ టవర్ల విధ్వంసంతో తమకు సంబంధం లేదన్న విషయాన్ని నిరూపించుకునే కొత్త సవాలు రైతుల ముందుకు తాజా పరిణామాలతో ఎదురవుతుందని చెప్పాలి.

ఈ విధ్వంసం పెరుగుతున్న కొద్దీ.. తొలుత పోలీసులు.. తర్వాతి కాలంలో కేంద్ర బలగాలు ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. అదే జరిగితే.. రైతు ఉద్యమం విరమించక తప్పనిస్థితి. అయినా.. అన్నం పెట్టే రైతు విషం చిమ్మే చాన్సు లేదు. అలా జరుగుతుందంటే.. కచ్ఛితంగా రైతు ఉద్యమంలోకి విద్రోహులు ఎంట్రీ ఇచ్చినట్లే. ఈ కలుపును ఏరేయాల్సిన బాధ్యతను రైతులు తీసుకుంటే కానీ.. తాజా సవాలును అధిగమించలేరని చెప్పక తప్పదు.