Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ పై రైతులకు ఎందుకు నమ్మకం లేదు?

By:  Tupaki Desk   |   4 Dec 2020 2:30 AM GMT
మోడీ సర్కార్ పై రైతులకు ఎందుకు నమ్మకం లేదు?
X
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 3 నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లక్ష మంది రైతులు ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరిస్తే తమకు తీరని అన్యాయం జరుగుతుందని రైతుల వాదన. కొత్త చట్టాల వల్ల రైతులకు నష్టమని, కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ), ప్రభుత్వం మండీల (మార్కెట్లు) నుంచి కొనుగోళ్లను కొత్త చట్టంలో చేర్చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, కొత్త చట్టం ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చని, దానివల్ల రైతులకు అధిక ప్రయోజనం అని మోడీ సర్కార్ అంటోంది. కానీ, రైతులు అందుకు ససేమిరా అంటున్నారు.

వాస్తవానికి ఇప్పటివరకు మహారాష్ట్రలో ఐటీసీ వంటి కార్పొరేట్ కంపెనీకి, రైతులకు మధ్య అనుసంధానకర్తగా ‘ఈ-చౌపాల్’‌ పథకం ఉంది. పంటలకు అనువైన వాతావరణ సమాచారాన్ని రైతులకు అందించడం, అంతర్జాయతీయ మార్కెట్‌లో పంటల‌ ధరలను రైతులకు తెలియజేయడం వంటి పనులు ఈ చౌపాల్ చేస్తోంది. ధరలు తెలుసుకోవడం ద్వారా మెరుగైన ధరకు తమ పంటను రైతులు అమ్ముకునేవారు. రైతులు, కంపెనీల మధ్య ఈ ఒప్పంద వ్యవసాయానికి ఈ-చౌపాల్ పథకం‌ ఒక మోడల్ కాబట్టి రైతులు అభ్యంతరం చెప్పలేదు. కానీ, కొత్త వ్యవసాయ చట్టం వల్ల రైతులపై అంబానీలు, అదానీలు ఆధిపత్యం చలాయించే చాన్స్ ఉంది. జియో మాదిరి ముందు మంచి ఆఫర్లు ఇచ్చి...ఆ తర్వాత ఆ కంపెనీలు చెప్పిన ధరకే పంట అమ్ముకోవాల్సి వస్తుందని రైతుల ఆవేదన. ఇప్పటికే జియో దెబ్బకు బీఎస్ఎన్ఎల్ నామరూపాలు పోయినట్లు....కొత్త చట్టం వల్ల వ్యవసాయం రూపు రేఖలు మారతాయని రైతులు అంటున్నారు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే ఉన్నాయని, కానీ, రైతులను దోచుకునేందుకు వాటికి అవకాశాలు పెరిగాయని, రైతుకు రక్షణ లేదని అంటున్నారు. కొత్త చట్టం ప్రైవేట్ కంపెనీలకు లాభసాటి అని, రైతులకు నష్టదాయకమని అందుకే తాము ఆ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని అంటున్నారు.