Begin typing your search above and press return to search.

గులాబీ బ్యాచ్ ని ఓపెన్ గా కడిగేస్తున్నారు

By:  Tupaki Desk   |   8 Nov 2015 4:22 AM GMT
గులాబీ బ్యాచ్ ని ఓపెన్ గా కడిగేస్తున్నారు
X
అనుకున్నది ఒకటి.. జరుగుతున్నది మరొకటన్నట్లుగా వ్యవహారం మారింది. వరంగల్ ఉప ఎన్నికల్లో తమకు తిరుగులేదని భావిస్తున్న తెలంగాణ అధికారపక్షానికి అనుకోని విధంగా ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైఖరిపట్ల అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేస్తూ.. ఇదేనా మీ పాలన అంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు తిరుగులేదని.. వరంగల్ ఉప ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడక లాంటిదని భావించిన గులాబీ బ్యాచ్ కి తాజా పరిణామాలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా తెలంగాణ అధికారపక్షంపై వరంగల్ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నలు సంధించటం అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారాయి.

మొన్నటికి మొన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. ఆ తర్వాత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. తాజాగా మంత్రి హరీశ్ రావు.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ లను నిలదీయటం.. మీరు చెప్పేదేదీ చేయటం లేదని నిరసన వ్యక్తం చేయటం గమనార్హం. తెలంగాణ అధికారపక్షంపై ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారని.. వారి అంచనాకు తగ్గట్లుగా టీఆర్ ఎస్ పాలన సాగటం లేదన్న విషయం తాజా నిరసనలతో వ్యక్తమవుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకటి తర్వాత మరొకటిగా వెల్లువెత్తుతున్న నిరసన దృశ్యాలు గులాబీ బ్యాచ్ కు తలనొప్పిగా మారాయి.

శనివారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండలంలో సభను ఏర్పాటు చేశారు. సభ అనుకున్నట్లుగా సజావుగా సాగదని.. తాము చెప్పేది మాత్రమే వినటానికి ప్రజలు రాలేదని.. తమను ప్రశ్నించటానికి సిద్ధమయ్యారన్న విషయం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే స్పష్టమైంది. ఆయన ప్రసంగించే సమయంలో రఘునాథపల్లికి చెందిన సిరిగిరి ఉప్పలయ్య అనే వ్యక్తి స్పందిస్తూ.. ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందటం లేదని.. చెప్పేది ఒకటి.. చేసేదొకటంటూ గట్టిగా అరిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో సభలో కలకలం చెలరేగింది. సదరు రైతును పోలీసులు వచ్చి బయటకు వంపించేశారు.

అనంతరం.. మంత్రి హరీశ్ రావు మాట్లాడేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో మరో నిరసన గళం బయటకు వచ్చింది. మోర్తాల మహేందర్ అన్న రైతులు మంత్రి హరీశ్ ముందుకు వచ్చి.. ‘‘మా చెరువులోకి గోదారి నీళ్లు ఎప్పుడు తెస్తారో చెప్పండి’’ అంటూ సూటిగా పశ్నించారు. రైతులకు ఇస్తామన్న పగటిపూట కరెంటు కూడా ఇవ్వటం లేదని.. ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదంటూ.. ‘‘ఇదేనా పాలన?’’ అని నిలదీశాడు. మంత్రి హరీశ్ లాంటి నేతను మాట్లాడనీయకుండా రైతు మహేందర్ ప్రశ్నలు మీద ప్రశ్నలు వేయటంతో.. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మారుజోడు రాంబాబు జోక్యం చేసుకొని అడగటానికి ఇదేనా సందర్భం అని గొడవకు దిగాడు.

దీంతో.. విషయం పక్కదారి పడుతుందన్న విషయాన్ని గుర్తించిన హరీశ్ సర్ది చెబుతూ శాంతింపజేశారు. అప్పటికే పోలీసులు.. పార్టీ కార్యకర్తలు వచ్చి అతడ్ని పక్కకు పంపించేశారు. తాజా పరిణామాలు చూస్తే.. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం విషయంలో ప్రజల నుంచి వచ్చే నిరసనలు మరిన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గెలుపుపై ధీమా పెట్టుకున్న అధికారపక్షానికి తాజా పరిణామాలు మింగుడుపడనివిగా చెప్పొచ్చు.