Begin typing your search above and press return to search.

తమ్ముళ్లు.. ఆ గ్రామాలకు వెళ్లొద్దు

By:  Tupaki Desk   |   13 Sep 2015 4:32 AM GMT
తమ్ముళ్లు.. ఆ గ్రామాలకు వెళ్లొద్దు
X
అధికారంలో ఉన్నప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజావ్యతిరేకత వచ్చే అంశాల జోలికి వీలైనంత తక్కువగా వెళ్లటం మంచిది. కానీ.. కొద్దిరోజులుగా ఏపీ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న ధోరణి.. సమస్యల్ని కొని తెచ్చుకునేలా ఉంది. ఇప్పటివరకూ ఈ విషయానికి సంబంధించి ప్రజాస్పందన తెలీనప్పటికీ..ఇప్పుడిప్పుడే తెలిసి షాక్ తింటున్నారు.

రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ మొదలు పెట్టడం.. ఈ వ్యవహారంలో కొంత వ్యతిరేకత వ్యక్తం కావటం తెలిసిందే. భూసమీకరణకు నో చెప్పిన వారిపై భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని ప్రయత్నించటం.. దీనికి వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీన్ లోకి ఎంటర్ కావటంతో ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. రాజధానిలో భూమి ఇవ్వని రైతుల విషయంలో ఎలాంటి చర్యలు ఉండవని.. వారి భూమిని బలవంతంగా లాక్కోమని తేల్చేశారు.

రాజధాని కోసం భూములు ఇవ్వని వారి విషయంలో ఎదురుదెబ్బ తిన్న ఏపీ సర్కారు.. ఇప్పుడు పలు ప్రాంతాల్లో అలాంటి పరిస్థితే ఎదురు కానుంది. ఒకవైపు బందర్ పోర్టు కోసం భారీగా భూమి కావాల్సి రావటం.. భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ఉత్సాహం ప్రదర్శించటం.. మరోవైపు భోగాపురంలో ఎయిర్ పోర్ట్ కోసం వేలాది ఎకరాలు ప్రయత్నించటం లాంటివి అక్కడి స్థానికుల కడుపు మండేలా చేస్తున్నాయి.

భూముల సేకరణ లాంటి వివాదాస్పద అంశాల్ని ఆచితూచి అడుగులు వేయాల్సి ఉన్నా.. ఒకేసారి భూముల సేకరణకు బాబు సర్కారు దృష్టి పెట్టిందన్న విమర్శ ఇబ్బంది కలిగించేదే. తమ భూములు సేకరించేందుకు వస్తున్న అధికారపక్ష నేతలకు ఊహించని షాక్ లు ఎదురవుతున్నాయి.

తాజాగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర.. కొనకళ్ల నారాయణలు ఇద్దరికి ఒకింత చేదు అనుభవం ఎదురైంది. బందర్ పోర్ట్ కోసం భూములు సేకరించటానికి ఉత్సాహంగా వెళ్లిన వీరిద్దరి పైనా అక్కడి స్థానికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బందర్ పోర్ట్ కు భూములు సేకరించేందుకు వెళ్లిన ఏపీ మంత్రి.. ఎంపీలకు స్థానికుల అగ్రహం ఏ రేంజ్ లో ఉందన్న విషయం అర్థమైంది.

తమ జీవనాధారం భూములేనని.. అలాంటి వాటిని ఎలా లాక్కుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ భూముల్ని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని తేల్చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కోన గ్రామానికి వచ్చిన మంత్రి.. ఎంపీలకు సంబంధించిన సిబ్బందిపై అక్కడి గ్రామస్థులు దురుసుగా వ్యవహరించి.. భూముల విషయంలో అడుగు ముందుకేస్తే బాగోదన్న రీతిలో హెచ్చరించారు.

మరోవైపు భోగాపురం భూ యజమానులు సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎడాపెడా భూసేకరణకు సంబంధించి నిర్ణయాలు తీసేసుకోవటం.. వాటిని పూర్తి చేసేందుకు తమ్ముళ్లు ఉత్సాహం ప్రదర్శించటం.. ఏపీ సర్కారుకు ఇబ్బంది కలిగించేదే. అందుకే.. ఏపీలోని గ్రామాల్లో పర్యటన పెట్టుకునే ముందు కాస్త వెనకా.. ముందు చూసుకొని ఊళ్లకు వెళితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ్ముళ్లు.. ఈ మాటల్ని వింటున్నారా?