Begin typing your search above and press return to search.

కేంద్రానికి షాక్ ఇచ్చిన రైతు సంఘాలు

By:  Tupaki Desk   |   3 Dec 2020 5:30 PM GMT
కేంద్రానికి షాక్ ఇచ్చిన రైతు సంఘాలు
X
సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ శివార్లలో ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు కేంద్రప్రభుత్వానికి ఈరోజు పెద్ద షాకే ఇచ్చారు. రైతు సంఘాల ఆందోళనకు తలొంచిన కేంద్రప్రభుత్వం చర్చలు జరపటానికి రైతులను ఆహ్వానించింది. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పియూష్ గోయెల్, సోమ్ ప్రకాష్ హాజరయ్యారు.

విజ్ఞాన్ భవన్ లో చర్చల సందర్భంగా మధ్యాహ్నం భోజన విరామ సమయం వచ్చింది. కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో పాటు రైతు ప్రతినిధులకు కూడా కేంద్రం లంచ్ అరేంజ్ చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనం తమకు అవసరం లేదంటు తిరస్కరించారు. రైతుల నుండి ఇటువంటి తిరస్కారాన్ని ఊహించని కేంద్రమంత్రులు షాక్ కు గురయ్యారు. రైతు ప్రతినిధులను మంత్రులు ఎంతగా బతిమలాడినా తాము తెచ్చుకున్న భోజనాన్నే తాము తింటామంటు రైతు ప్రతినిధులు తెగేసి చెప్పారు. అలాగే చర్చల సందర్భంగా మంత్రులు ఇచ్చిన టీ, బిస్కట్లను కూడా రైతులెవరు కనీసం ముట్టుకోను కూడా లేదు.

భోజనాన్ని ఏర్పాటు చేసిన హాలులోనే రైతులు ఓ మూల కూర్చుని తమతో పాటు తీసుకెళ్ళిన రొట్టెలు, సబ్జీ, ఉల్లిపాయలనే తినేశారు. చర్చల సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు హాని కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నదే తమ డిమాండ్ గా రైతుల ప్రతినిధులు మంత్రులకు స్పష్టం చేశారు.

రైతులను వ్యవసాయ వివాదాల బోర్టులోకి తీసుకోవాలని, కనీస మద్దతు ధరలకు హామీ ఇవ్వాలని, కాంట్రాక్టు వ్యవసాయ విషయంలో వివాదం వస్తే కోర్టులను ఆశ్రయించే అవకాశాలను కల్పించాలనే డిమాండ్లను కేంద్రం పరిశీలిస్తోంది. అయితే హోలు మొత్తం మీద నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసే ఆలోచనైతే కేంద్రంలో కనిపిస్తున్నట్లు లేదు. మొత్తం మీద కేంద్రం అరేంజ్ చేసిన భోజనాన్ని, టీ, బిస్కట్లను కూడా తిరస్కరించటంతో రైతులు తమ డిమాండ్ల విషయంలో ఎంత గట్టిగా ఉన్నారనే విషయం బయటపడింది.