Begin typing your search above and press return to search.

ఆత్మహత్యల తెలంగాణ

By:  Tupaki Desk   |   22 Sep 2015 12:30 AM GMT
ఆత్మహత్యల తెలంగాణ
X
యువకుల ఆత్మహత్యలతో సిద్ధించిన తెలంగాణలో ఆ ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత నుంచి ఎవరో ఒకళ్లు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. రైతులు.. విద్యార్థులు.. పింఛనుదారులు.. ఇప్పుడు మళ్లీ రైతులు.. కల్తీ కల్లు బాధితులు.. ఇలా ఆత్మహత్యలకు అంతు ఉండడం లేదు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే అద్భుతం జరిగిపోతుందని కేసీఆర్ అండ్ కో పదే పదే చెప్పడంతో అప్పట్లో యువకులు ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణ వచ్చి ఏడాదిన్నర జరిగినా ఇప్పటి వరకు ఒక్క అద్భుతం కూడా కనిపించకపోవడంతో ఇప్పుడు వివిధ వర్గాలు చనిపోతున్నాయి. వాస్తవానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులు పింఛను కోసం ఆవేదనతో చనిపోయిన దాఖలాలు తక్కువ. చంద్రబాబు నాయుడు హయాంలో గతంలో ఇటువంటి ఘటనలు జరిగేవని విమర్శలు వచ్చేవి. ఊళ్లో ఒకళ్లు చనిపోతేనే మరొకరికి పింఛను ఇస్తానని ఆయన చెప్పడం ఇందుకు కారణమని విమర్శలు వచ్చేవి. కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ పదేళ్ల హయాంలో పింఛను కోసం చనిపోయిన ఘటన ఒక్కటీ లేదు. కానీ, తెలంగాణలో ఇటువంటి ఘటనలు ఎన్నో. ఇక రైతు ఆత్మహత్యలు చంద్రబాబు హయాంలో మొదలయ్యాయి. తారస్థాయికి చేరాయి. వైఎస్ హయాంలో జరిగాయి. ఇప్పుడు కేసీఆర్ హయాంలో తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ఉద్యోగం రాలేదంటూ అటు చంద్రబాబు హయాంలో కానీ ఇటు వైఎస్ హయాంలో కానీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అతి స్వల్పం. కానీ, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశ చూపడం వల్ల కేసీఆర్ హయాంలో ఉద్యోగం రాలేదని కూడా యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యలు చేసుకోని వివిధ వర్గాలు కూడా ఇప్పుడు తనువు చాలిస్తున్నరని, పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు.