Begin typing your search above and press return to search.

ఇంట్లో ఈగల మోత..బయటేమో పల్లకీల మోతా

By:  Tupaki Desk   |   10 Sep 2015 4:09 AM GMT
ఇంట్లో ఈగల మోత..బయటేమో పల్లకీల మోతా
X
ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూసుకెళ్లిపోతున్న వైనం తెలిసిందే. ఓపక్క పారిశ్రామికవేత్తలతో సమావేశం కావటం.. ఆ దేశ నేతలతో భేటీ అవుతూ.. క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదిక మీద నుంచి తాజాగా ఆయన చేసిన ప్రసంగానికి పలువురు ప్రశంసలు ఇస్తున్నారు.

తెలంగాణ సాధనకు సంబంధించి సెల్ఫ్ క్రెడిట్ ఇచ్చేసుకున్న ఆయన.. ప్రధాని మోడీని సైతం పొగిడేశారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల ప్రయత్నాన్ని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. మోడీ పని తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విదేశీ గడ్డపై కేసీఆర్ వ్యవహారశైలిని పలువురు అభినందిస్తున్నారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులు ఆకర్షించటంతో కేసీఆర్ అండ్ కో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఓవైపు చైనాలో కేసీఆర్ చెలరేగిపోతుంటే.. మరోవైపు సొంతిట్లో మాత్రం కేసీఆర్ సర్కారు పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు కురుస్తున్నాయి. ఓవైపు రైతుల ఆత్మహత్యలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఆత్మహత్యలతో పిట్టల్లా రాలిపోతున్న రైతులకు.. వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చేలా తెలంగాణ సర్కారు ఎలాంటి చర్యల్ని తీసుకోవటం లేదన్న విమర్శ వినిపిస్తోంది.

ఉన్నట్లుండి తెలంగాణలో రైతులు ఇంత భారీగా ఆత్మహత్యలు చేసుకోవటానికి దారి తీసిన కారణాలేంటన్నది ఒకపట్టాన వెలుగులోకి రావటం లేదు. ఓవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వారి సమస్యలకు ఒక పరిష్కారం చూడకుండానే కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లిపోయారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఓపక్క అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెలరేగిపోతుంటే.. మరోవైపు సొంత రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఆయన పాలనలోని వైఫల్యం కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై టీఆర్ ఎస్ సర్కారుకు మంచిపేరు ఎంత అవసరమో.. తెలంగాణ రాష్ట్రంలోనూ అంతే అవసరం కదా? ఆ విషయాన్ని గులాబీ అధినేత ఎందుకు పట్టించుకోవటం లేదు..?