Begin typing your search above and press return to search.

ఏడాదిలో 1979 అన్నదాతల ఆత్మహత్యలు

By:  Tupaki Desk   |   19 July 2015 5:00 AM GMT
ఏడాదిలో 1979 అన్నదాతల ఆత్మహత్యలు
X
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ నోరు విప్పితే గొప్పలు చెప్పేస్తారు. తామెంత కష్టపడతున్నామో.. ప్రజల్ని ఎంత చక్కగా చూసుకుంటున్నామో ఏకరువు పెడతారు. ఇప్పటికే చాలా చేస్తున్నామని.. భవిష్యత్తులో మరిన్ని చేస్తామని చెప్పే వారు.. ఎవరికి వారు కోసే కోతలకు అంతుపొంతు ఉండదు. మాటల్లోనే స్వర్గాన్నిచూపించే ఈ ఇద్దరు చంద్రుళ్ల హయాంలో అన్నం పెట్టే అన్నదాతల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పకనే చెప్పే గణాంకాలు తాజాగా బయటకు వచ్చాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలానే పీకేస్తున్నమని చెప్పుకునే చంద్రుళ్లు.. సదరు అధికారిక నివేదిక మీద ఎలా స్పందిస్తారో చూడాలి. అన్నదాతల పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం బోగాలేదన్న విషయం గణాంకాల్ని పరిశీలిస్తే ఇట్టే తెలుస్తుంది. ఇక.. రెండు రాష్ట్రాల విషయాన్నే తీసుకుంటే.. తెలంగాణతో పోలిస్తే ఏపీ కాస్త మెరుగ్గా కనిపిస్తుంది.

బంగారు తెలంగాణను తరచూ ప్రస్తావించే ముఖ్యమంత్రి కేసీఆర్.. తన హయాంలో పెద్ద ఎత్తున చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యలకు సమాధానం చెప్పాల్సని రీతిలో తాజా గణాంకాలు ఉన్నాయి. జాతీయ నేర సంస్థ నమోదు చేసిన వివరాల ఆధారంగా తాజా గణాంకాల్ని వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. దేశంలో అత్యధికంగా అన్నదాతల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే.. తెలంగాణ రెండో స్థానంలో నిలిచిన దుస్థితి. ఇక.. ఏపీ ఏడో స్థానంలో నిలిచింది.

ఇక.. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..2014లో తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడే వారిలో 1347 మంది ఆత్మహత్యలు చేసుకోగా.. ఏపీలో 632 మంది సూసైడ్ చేసుకున్నారు.చాలా పరిమితంగా మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారన్న మాట చెప్పే ఏపీ సర్కారు తాజా గణంకాలకు ఏం సమాధానం చెబుతుందన్నది ప్రశ్నగా మారింది.

అదే సమయంలో.. తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడే వారి ఆత్మహత్యలు.. విపక్షాలు పేర్కొన్న తీవ్రతను ప్రతిబించేలా ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక ఆత్మహత్యలకు పాల్పడిన వారిని చూస్తే.. రైతులే కాక.. కౌలురైతులు.. వ్యవసాయ కూలీలు ఉండటం గమనార్హం. రైతుల కంట కన్నీరు లేకుండా చేస్తున్నట్లుగా చెప్పుకునే ఇద్దరు ముఖ్యమంత్రులు జాతీయ నేర నమోదు సంస్థ వెల్లడించిన గణాంకాలపై సమాధానం చెప్పటమే కాదు.. బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.