Begin typing your search above and press return to search.

కేసీఆర్ భరోసా రైతుకు ధైర్యాన్ని ఇవ్వలేదు

By:  Tupaki Desk   |   3 Oct 2015 4:14 AM GMT
కేసీఆర్ భరోసా రైతుకు ధైర్యాన్ని ఇవ్వలేదు
X
తెలంగాణ సాధించింది చచ్చిపోవటానికి కాదు. ప్లీజ్ మీరెవరూ ఆత్మహత్య చేసుకోవద్దంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట తెలంగాణ అన్నదాతకు భరోసా ఇవ్వలేకపోయింది. పురుగుల మందును పెరుగన్నంగా.. పొలం దగ్గర చెట్టుకు ఊరేసుకొని.. కాల్వలోకి దూకేసి తమ ప్రాణాల్ని తీసేసుకున్నారు.

రుణమాఫీ ఏక మొత్తంగా తీసేయటం కుదరదని.. దానికి మరింత సమయం పడుతుందని లెక్కలు చెప్పటం.. తమ కష్టాలకు ప్రభుత్వం దగ్గర పరిష్కారం లేదని భావించారో.. లేక.. తమ సమస్యలకు చావుకు మించిన పరిష్కారం లేదనుకున్నారో కానీ.. శుక్రవారం ఒక్కరోజులో తెలంగాణ వ్యాప్తంగా 14 మంది అన్నదాతలు ప్రాణాలు తీసుకున్నారు.

రైతుల ఆత్మహత్యల అంశంపై సీరియస్ నెస్ ఉండాలంటూ మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ చెప్పిన మాట అక్షర సత్యమని తాజాగా చోటు చేసుకున్న ఆత్మహత్యలు నిరూపించాయి. పంటలు ఎండిపోవటం.. పూత సరిగా లేకపోవటం.. ఇప్పటికే ఉన్న అప్పుల నుంచి పంట చేతికి వచ్చి ఆదుకుంటాయని భావించిన వారికి.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటం తట్టుకోలేక ఇంత భారీగా ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది.

దీనికి తోడు ప్రభుత్వం నుంచి భరోసా కల్పించే మాట రాకపోవటం కూడా అన్నదాతల్లో ఆత్మస్థైర్యం లోపించినట్లుగా చెబుతున్నారు. ఒకేరోజు పద్నాలుగు మంది తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఏపీలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం గమనార్హం.

ఇక తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు జిల్లాల వారీగా చూస్తే..

= మెదక్ 2

= మహబూబ్ నగర్ 2

= అదిలాబాద్ 2

= నిజామాబాద్ 1

= కరీంనగర్ 1

= నల్లగొండ 3

= వరంగల్ 2

= రంగారెడ్డి 1