Begin typing your search above and press return to search.

ధ‌నిక రాష్ట్రంలో అన్న‌దాత‌ల చావులేంది?

By:  Tupaki Desk   |   5 Aug 2017 6:09 AM GMT
ధ‌నిక రాష్ట్రంలో అన్న‌దాత‌ల చావులేంది?
X
ఓప‌క్క బంగారు తెలంగాణ కోసం తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కిందామీదా ప‌డుతున్న‌ట్లుగా చెప్ప‌టం తెలిసిందే. ప్రాణాల్ని ప‌ణంగా పెట్టి మ‌రీ సాధించిన తెలంగాణ‌ను.. త‌న క‌ల అయిన బంగారు తెలంగాణ బాట‌లో న‌డిపించేందుకు నోరు క‌ట్టుకొని మ‌రీ అవినీతి అన్న‌ది లేకుండా తాము పాల‌న సాగిస్తున్న‌ట్లుగా కేసీఆర్ చెప్ప‌టం తెలిసిందే. రైతుల సంక్షేమం కోసం తాము ప‌డిన క‌ష్టం.. మ‌రెవ‌రూ ప‌డ‌న‌ట్లుగా చెప్పే కేసీఆర్ మాట‌లు విన్న‌ప్పుడు.. ఎంత మంచి సీఎం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ల‌భించారో అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

అయితే.. వాస్త‌వాలు అందుకు భిన్నంగా క‌నిపించ‌టం ఇబ్బంది క‌లిగించే విష‌యంగా చెప్ప‌క త‌ప్ప‌దు. బంగారు తెలంగాణ సాధ‌న కోసం అహ‌ర‌హం శ్ర‌మిస్తున్న తెలంగాణ అధికార‌ప‌క్షానికి ఇబ్బంది క‌లిగించే రీతిలో న‌లుగురు బ‌క్క‌చిక్కిన రైతులు ఒకేరోజు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది. ధ‌నిక రాష్ట్రంగా చెప్పే తెలంగాణ‌లో రోజు వ్య‌వ‌ధిలో న‌లుగురు బ‌త‌క‌లేక బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పాలు కావ‌టం శోచ‌నీయంగా చెప్ప‌క త‌ప్పదు.

వేలాది కోట్ల రూపాయిలు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ఖ‌ర్చు చేస్తుంటే.. మ‌రోవైపు అందుకు భిన్న‌మైన ఫ‌లితాలు చోటు చేసుకోవ‌టం దేనికి నిద‌ర్శ‌నం? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. రంగారెడ్డి జిల్లా అమ‌న‌గ‌ల్లు మండ‌లం కొత్తకుంట తండాకు చెందిన 36 ఏళ్ల సీతారాం ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. అదే రీతిలో జ‌య‌శంక‌ర్ జిల్లా వెంక‌టాపురం మండ‌లం కేశ‌వాపురంలో 28 ఏళ్ల‌ దుండ్ర కొమ‌ర‌య్య.. జ‌న‌గామ జిల్లా గుండాల మండ‌లం పెద్ద‌ప‌డిశాల‌లో 45 ఏళ్ల తోట శ్రీహ‌రి.. న‌ల్ల‌గొండ జిల్లా నాంప‌ల్లి మండ‌లం ర‌త్య‌తండాకు చెందిన పాతికేళ్ల ర‌మావ‌త్ మ‌ధులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వ‌స్తే.. స‌మైక్య‌పాల‌కుల ఆరాచ‌కాలు పోయి.. సొంత పాల‌కుల హ‌యాంలో స్వ‌ర్గంగా మారుతుంద‌న్న క‌ల‌ల ముచ్చ‌ట పోయి.. అర్థాంత‌రంగా జీవితాన్ని చాలిస్తున్న ఈ దారుణాల‌పై కేసీఆర్ దృష్టి పెడితే బాగుంటుంది.