Begin typing your search above and press return to search.

ఫ‌రూక్ అబ్దుల్లా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఉండ‌టానికి తిరస్క‌రించింది అందుకేనా?

By:  Tupaki Desk   |   19 Jun 2022 12:30 PM GMT
ఫ‌రూక్ అబ్దుల్లా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఉండ‌టానికి తిరస్క‌రించింది అందుకేనా?
X
జూలై 18న జ‌ర‌గ‌బోయే రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు సంబంధించి ఇంకా ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి ఖ‌రారు కాలేదు. ప్ర‌తిప‌క్షాల అన్నింటి త‌ర‌ఫున ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ చొర‌వ తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 17 పార్టీల అధినేత‌ల‌తో ఢిల్లీలో కొద్దిరోజుల క్రితం స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి శిరోమ‌ణి అకాలీద‌ళ్, జిజూ జ‌న‌తాద‌ళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ వంటివి మిన‌హా దాదాపు మిగ‌తా అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు హాజ‌ర‌య్యాయి. చివ‌ర‌కు మ‌మ‌తా బెన‌ర్జీతో ఉప్పూనిప్పుగా వ్య‌వ‌హ‌రించే క‌మ్యూనిస్టు పార్టీలు సైతం వ‌చ్చాయి.

ఈ స‌మావేశంలో శ‌ర‌ద్ ప‌వార్ ను ప్ర‌తిపక్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో నిల‌పాల‌ని ఆ పార్టీలు నిర్ణ‌యించ‌గా ఆయ‌న తిర‌స్క‌రించారు. ప్ర‌ధాన‌మంత్రి ప‌దవి మీద మోజు తీర‌క‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న రాష్ట్ర‌ప‌తిగా ఉండ‌టానికి తిర‌స్క‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక జ‌మ్ము క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్సు అధినేత‌ ఫ‌రూఖ్ అబ్దుల్లాను త‌మ అభ్య‌ర్థిగా రంగంలోకి దించాల‌ని నిర్ణ‌యించాయి. అయితే ఆయ‌న కూడా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి తిర‌స్క‌రించారు.

జ‌మ్మూకశ్మీర్ కు సుదీర్ఘ‌కాలం ముఖ్య‌మంత్రిగా ఫ‌రూఖ్ అబ్దుల్లా వ్య‌వ‌హ‌రించారు. బీజేపీ ప్ర‌భుత్వం జ‌మ్మూక‌శ్మీర్ కు రాష్ట్ర హోదాను తొల‌గించి కేంద్ర‌పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది జ‌మ్ముక‌శ్మీర్ అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో మ‌రోమారు జ‌మ్ముక‌శ్మీర్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగాల‌ని కోరుకుంటున్న ఫ‌రూఖ్ అబ్దుల్లా రాష్ట్ర‌ప‌తి ప‌దవిని చేప‌ట్ట‌డానికి నిరాక‌రించార‌ని తెలుస్తోంది.

అలాగే ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌ల‌సినా బీజేపీ అభ్య‌ర్థిని రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఓడించ‌డం క‌ష్టం. బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాల‌కు 49.1 శాతం మెజారిటీ ఉంది. అలాగే ప్ర‌తిప‌క్షాల‌కు 51.9 శాతం మెజారిటీ ఉంది. అయితే బీజేపీ ప్ర‌భుత్వానికి ఎలాంటి మ‌ద్దతు ఇవ్వ‌డానికైనా ఉవ్విళ్లూరుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఒడిశాలోని బిజూ జ‌న‌తాద‌ళ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి సునాయాసంగా గెలుపొంద‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో ఓడిపోయే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఎందుక‌నే ఉద్దేశంతోనే ఫ‌రూఖ్ అబ్దుల్లా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఉండ‌టానికి తిర‌స్క‌రించార‌ని చెబుతున్నారు.

శ‌ర‌ద్ ప‌వార్, ఫ‌రూఖ్ అబ్దుల్లా ఇద్ద‌రూ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఉండ‌టానికి తిర‌స్క‌రించ‌డంతో ఇక ప్ర‌తిప‌క్షాల ఆశ‌ల‌న్నీ గోపాల‌కృష్ణ గోఖ‌లేపైనే పెట్టుకున్నాయి. ఆయ‌న తాను ఆలోచించుకోవ‌డానికి మ‌రికొద్ది రోజుల స‌మ‌యం కావాల‌ని అంటున్నారు.