Begin typing your search above and press return to search.

ఉరి పడినా పశ్చాతపం లేని క్రూరమృగం..

By:  Tupaki Desk   |   7 Feb 2020 9:12 AM GMT
ఉరి పడినా పశ్చాతపం లేని క్రూరమృగం..
X
అమాయికులైన బాలికలను మాయమాటలు చెప్పి కోరిక తీర్చుకుని దారుణంగా హతమార్చి మళ్లీ ఏమీ ఎరుగని గ్రామంలో తిరుగుతున్న నిందితుడిని చూసి తెలుగు రాష్ట్రాలు అవాక్కయ్యాయి. క్రూరుడు ప్రజల మధ్య ఏమీ ఎరుగనట్టు ప్రవర్తించడం అందర్నీ విస్మయం కలిగించింది. ముగ్గురు బాలికలను బల్కతారం చేసి హతమార్చిన నిందితుడికి ఉరిశిక్ష పడ్డా ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అతడే శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో జరిగిన దారుణ ఘటనలు గతేడాది వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ కేసులో విచారణ పూర్తయి ఫిబ్రవరి 6వ తేదీన అతడికి ఉరిశిక్ష వేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే విచారణ సమయంలో కోర్టులో శ్రీనివాస్ రెడ్డిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు అవాక్కయ్యారు. హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి (14) - మనీషా (17) - మైసిరెడ్డిపల్లికి చెందిన తుంగల కల్పన (11)ను మాయమాటలతో తనతో తీసుకెళ్లి అత్యాచారం చేసిన అనంతరం గ్రామంలోని పాడుపడిన బావిలో మృతదేహాలను పూడ్చిన పెట్టిన ఘటనను చూసి అందరూ షాక్ కు గురయ్యారు.

ఈ ఘటనలతో ప్రజా ఉద్యమాలు ఎగిశాయి. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ అప్పట్లో హాజీపూర్ గ్రామస్తులతో పాటు పెద్ద ఎత్తున స్థానికులు, ఇతర ప్రాంతాల్లో వివిధ పార్టీల నేతలు - మహిళా - ప్రజాసంఘాలు నేతలు కూడా ఆందోళనలు చేశారు. ముగ్గురు బాలికల అత్యాచారం - హత్యపై నల్గొండలో పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టారు. 90 రోజుల్లో పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసులకు సంబంధించి 101 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ తోపాటు సైంటిఫిక్ ఆధారాలను కూడా పోలీసులు కోర్టు ముందు ఉంచడంతో అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 13 వరకు కోర్టులో విచారణ నడిచింది. చివరకు విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా హాజీపూర్ తో పాటు పరిసర గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఈ తీర్పును ప్రజలందరూ స్వాగతించారు.