Begin typing your search above and press return to search.

నేత‌ల నోట సినిమా డైలాగులు క‌ట్ అయిన‌ట్లే

By:  Tupaki Desk   |   2 Nov 2017 7:13 AM GMT
నేత‌ల నోట సినిమా డైలాగులు క‌ట్ అయిన‌ట్లే
X
చేతిలో ప‌వ‌ర్ ఉంటే చాలు.. ఏం చేసినా న‌డిచిపోతుంద‌న్న‌ట్లుగా ఉంటుంది కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల తీరు చూస్తే. ఎంత అధికారంలో ఉన్నా.. అన్నిసార్లు కాకున్నా కొన్నిసార్లు చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోవ‌టం.. కొమ్ములు తిరిగిన అధినేత‌లు క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లిన వైనం అంద‌రికి తెలిసిన విష‌యాలే.

అయితే.. ఎప్పుడో ఒక‌సారి.. ఏదో ఒక ఉదంతంలో కేసులు నిరూపిత‌మై.. శిక్ష అనుభ‌వించే నేత‌లు కొంద‌రు క‌నిపిస్తుంటారు. అయితే.. ఇలాంటివి రానున్న రోజుల్లో మ‌రింత ఎక్కువ కావ‌టం ఖాయ‌మ‌న్న తాజా ప‌రిణామాన్ని చూస్తే అనిపించ‌క మాన‌దు.

త‌ప్పు చేసినోళ్లు కేసులు వేస్తానంటే.. వేసుకో.. తీర్పు వ‌చ్చేస‌రికి ట‌ర్మ్ కూడా పూర్తి అవుతుంద‌న్న మాట చాలామంది నేత‌ల నోట కామ‌న్ గా వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఈ త‌ర‌హా సినిమా డైలాగుల‌కు చెక్ చెప్పిన‌ట్లేన‌ని చెప్పాలి. ఎందుకంటే.. నేత‌ల మీద వ‌చ్చే కేసుల విచార‌ణ‌లో జాప్యం లేకుండా సాల్వ్ చేయ‌టానికి.. ప్ర‌తిరోజు కేసుల‌ను విచారించి.. నిర్ణ‌యాలు వెల్ల‌డించేందుకు వీలుగా ప్ర‌త్యేక కోర్టును ఏర్పాటు చేయాల‌ని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో.. ఎమ్మెల్యేలు.. రాజ‌కీయ నేత‌ల అవినీతి మీదా.. వారి మీద వ‌చ్చే ఆరోప‌ణ‌ల మీదా విచార‌ణ జ‌ర‌ప‌నున్నారు. సుప్రీం చెప్పిన‌ట్లే జ‌రిగితే విచార‌ణ త్వ‌రిత‌గ‌తిన పూర్తి అయ్యే అవ‌కాశం ఉంటుంది.

దేశంలో ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధుల‌పై వ‌స్తున్న నేరారోప‌ణ‌ల విచార‌ణ ఓ పెద్ద ప్ర‌హ‌స‌నంగా మారింది.ఈ నేప‌థ్యంలో ఇలాంటి కేసులతో ప్ర‌జాప్ర‌తినిధుల సంగ‌తి చూడాల‌ని కోర్టు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నికైన వారిపై న‌మోదు చేసిన కేసులు దేశ వ్యాప్తంగా 1581 ఉన్నాయి. వీటిల్లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏం చేశారు? ఎక్క‌డి వ‌ర‌కూ విచార‌ణ వ‌చ్చింది? అంటూ ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన విచార‌ణ అంశాన్ని తెర మీద‌కు తీసుకొచ్చి అస‌లేం జ‌రిగింద‌న్న వివ‌రాల్ని సేక‌రిస్తారు.

అసెంబ్లీకి ఎన్నికైన వారి మీద వ‌స్తున్న ఫిర్యాదులు నానాటికి పెరుగుతున్నాయి. ఇక‌.. కేసులు తేల‌క‌పోవ‌టంతో ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వారు సైతం ద‌ర్జాగా ప‌దవీ కాలం పూర్తి అయిన త‌ర్వాత దిగిపోతున్నారు. ఇలాంటి వాటికి చెక్ చెబుతూ.. నేత‌ల మీద వ‌చ్చే ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన అంశాల మీద‌నే దృష్టి పెట్టాల‌ని భావిస్తున్నారు. ఈ కోర్టు ఎవ‌రి అధీనంలో కాకుండా స్వ‌తంత్య్రంగా ప‌ని చేయాల‌ని సుప్రీంకోర్టు భావిస్తోంది.

నేత‌ల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలితే.. ప్ర‌స్తుతం ఆరేళ్ల వ‌ర‌కూ వారు పోటీ చేసే అవ‌కాశం లేకుండా నిషేధం విధిస్తున్నారు. అయితే.. దీన్ని మ‌రింత క‌ర‌కుగా త‌యారు చేసి. శిక్ష‌ను జీవిత‌కాలంగా మార్చాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అదే జ‌రిగితే నేరారోప‌ణ‌లు న‌మోదైతే సింఫుల్ గా తీసుకునే రాజ‌కీయ నేత‌ల్లో వ‌ణుకు పుట్ట‌టం ఖాయం. రాజ‌కీయాల్లో సుద్ద‌పూస‌లు ఉండాల‌న్న చిర‌కాల వాంఛ అంశంలో.. సుప్రీం మ‌రింత శ్ర‌ద్ధ‌ను చూపించిన పక్షంలో వాస్త‌వ రూపం దాల్చే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.