Begin typing your search above and press return to search.

తుర్కియేలో విషాదం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఓ తండ్రి ఫోటో..!

By:  Tupaki Desk   |   8 Feb 2023 5:34 PM GMT
తుర్కియేలో విషాదం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఓ తండ్రి ఫోటో..!
X
తుర్కియే.. సిరియా దేశాల్లో సోమవారం వరుసగా మూడు భారీ భూకంపాలు సంభవించింది. గంటల వ్యవధిలోనే భారీ భూకంపాలు రావడంతో వందలాది మంది మృత్యువాత పడగా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. సహాయ చర్యలు కొనసాగుతున్న సమయంలో సైతం భూప్రకంపనలు వస్తుండటంతో ఆటంకాలు కలుగుతున్నాయి.

మరోవైపు గత రెండు రోజుల వ్యవధిలో టర్కీ.. సిరియా ప్రాంతాల్లో 200లకు పైగా భూమి కంపించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి దాకా 2వేలు.. 3వేలు ఉన్న మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా సమాచారం మేరకు మృతుల సంఖ్య 7700లకు చేరగా 42 వేలకు పైగా ప్రజలు గాయపడ్డారు.

మరోవైపు శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసే క్రమంలో అనేక హృదయవిదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారు చేస్తున్న అర్ధనాథాలతో ఆ ప్రాంత మరుభూమిని తలపిస్తోంది. ఇదిలా ఉంటే నిన్నే ఓ మహిళ శిథిలాల కింద ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డను ఓ వ్యక్తి పట్టుకొని ఆస్పత్రికి తరలిస్తుండగా తీసిన ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇటువంటి ఘటనలు టర్కీ.. సిరియా ప్రాంతాల్లో అనేకం వెలుగు చూస్తున్నాయి. ఇలాంటిదే ఓ విషాదకర ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. భూకంపం ధాటికి ఓ భవంతి పేకమేడలా కూలింది. ఈ ఘటనలో ఓ తండ్రి తన కూతురిని కోల్పోయాడు. దీంతో శిథిలాల కింద చిక్కుకుపోయిన తన కూతురి చేతిని పట్టుకొని దీనంగా ఆ తండ్రి విలపించడం అందరినీ కలిచివేస్తోంది.

15 ఏళ్ళ ఇర్మాక్ అనే అమ్మాయి నిద్రపోతున్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున భూకంపం రావడంతో అనేకమంది తేరుకునేలోపే అపార నష్టం జరిగింది. భవనాలన్నీ పేకమేడలా కూలడంతో శిథిలాల కిందే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇర్మాక్ అనే అమ్మాయి శిథిలాల కింద ఇరుక్కుపోయి చనిపోయింది.

అయితే ఆమె తండ్రి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తన కళ్లెదుటే చనిపోవడంతో ఆ వ్యక్తి ఆమె మృతదేహం వద్దే కన్నీరుమున్నీరుగా విలపించడం హృదయవిదారకంగా మారింది. తుర్కియే.. సిరియా భూకంప ఘటనతో అనేక మంది తన రక్త సంబంధీకులను.. స్నేహితులను.. ఆస్తులు కోల్పోయి రోడ్డున పడటం విషాదాన్ని నింపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.